‘మహానటి’గా కీర్తి అలరించింది, ఆకట్టుకుంది. చరిత్రలో చిరకాలం మిగిలిపోయే పాత్ర పోషించింది. అయితే.. ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్‌కి లభించిన పారితోషికం ఎంత? అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు తెలిసొచ్చాయి. ఈ సినిమాతో కీర్తికి కనీసం రూ.2 కోట్ల పారితోషికం అయినా దక్కి ఉంటుందని సినీ జనాలు అంచనా వేస్తున్నారు. నాలుగు సినిమాలకు సరిపడ కష్టం, కాల్షీట్లు ఈ ఒక్క సినిమాకే కేటాయించింది కీర్తి. ఈ సినిమాకి ఆత్మ ఆమే. అందుకే ఎంతిచ్చినా తప్పులేదు. అయితే ఈ సినిమాద్వారా కీర్తికి అందినది రూ.50 లక్షలే అని సమాచారం. ‘నేను శైలజ’ తరవాత ‘నేను లోకల్’ చేస్తున్న సమయంలోనే కీర్తికి ఈ ఆఫర్ వచ్చింది. అప్పటికి ఆమె పారితోషికం రూ.50 లక్షలలోపే. పైగా ‘ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్న సినిమా. కమర్షియల్ ఉద్దేశ్యాలేం లేవు’ అని కీర్తికి చెప్పడంతో ‘పారితోషికం తీసుకోకుండానే నటించడానికి సిద్ధం’ అని చెప్పిందట. కానీ అశ్వనీదత్ మాత్రం రూ.50 లక్షలకు ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, ఆ మెత్తం ఇచ్చేశారని సమాచారం. ఈ స్థాయిలో ఈ సినిమా విజయవంతం అవుతుందనుకుంటే… కీర్తి ఏ రూ2 కోట్లో అడిగేది. అయినా డబ్బు కంటే.. గొప్ప పాత్రలు దక్కడమే ముఖ్యం. ఆ రకంగా కీర్తి తన లక్ష్యాన్ని సాధించినట్టే.