‘మహానటి’ సినిమా ప్రకటన వచ్చింది. మహానటి సావిత్రమ్మ జీవితం ఆధారంగా సినిమా అన్నారు. బావుంది. ఇంతకీ సావిత్రి ఎవరు? విద్యాబాలన్ నుండి సమంత వరకూ బోలెడు పేర్లు వినిపించాయి. నిత్యమీనన్ అయితే బాగుంటుందనుకున్నారు. నిత్యకు ఆ పాత్ర నచ్చింది. కానీ.. ఎందుకో నిత్య ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాదాపు ఆరు నెలలు సావిత్రి ఎవరు ? అనే పాయింట్ చుట్టే వార్తలు నడిచాయి. అయితే అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సావిత్రిగా కీర్తి సురేష్ పేరు ప్రకటించాడు. నిజంగా ఇది షాకే. ఎందుకంటే సావిత్రమ్మ ఎక్కడ? కీర్తి సురేష్ ఎక్కడ ? ఇలా అనుకోవడానికి కారణం వుంది.
కీర్తి సురేష్ హిట్స్ సినిమాల్లో నటించింది. క్రేజ్ వుంది. బ్యూటిఫుల్. కాని నటిగా మాత్రం ఆమెకు పాస్ మార్కులు పడిన సినిమాలు లేవు. పైగా ఒకటే ఎక్స్ ప్రెషన్ అనే విమర్శవుంది. ఇందులో నిజం కూడా వుంది. ఆమె తెలుగులో చేసిన తొలి సినిమా నేను శైలజ హిట్. ఈ సినిమాలో అమెది మంచి పాత్ర కూడా. అయితే ఆ పాత్రలో ఆమెకు ఎక్కువ మార్కులు పడలేదు. చాలా చోట్ల బ్లాక్ ఎక్స్ ప్రెషన్ తో కనిపిస్తుంది. క్లూ లెస్ గా కనిపించిన సీన్స్ కూడా వున్నాయి. నానితో చేసిన ”నేను లోకల్’ లో కూడా అమెది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. చిరాకు పడటం, తర్వాత ప్రేమగా నటించడం తప్పితే మరో ఎక్స్ప్రెషన్ కనిపించదు. ఇక అజ్ఞాతవాసిలో ఒక రెండు సీన్లు, రెండు పాటలకు పరిమితమైన రోల్ చేసింది. అందులో కూడా ఏం గొప్పగా లేదు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న కీర్తి సురేష్ ని సావిత్రమ్మ అని ప్రకటించింది వైజయంతి టీం.
అందరిలో ఒకటే అనుమానం. అసలు సావిత్రమ్మ పాత్రను కీర్తి ఎలా మోస్తుందో అని. కీర్తి ఎంపిక కచ్చితంగా రాంగ్ ఛాయిసే అనిపించింది. మహానటి కథని తీస్తున్నప్పుడు ఆ స్థాయికి తగిన నటిని ఎంచుకోకపోవడం పెద్ద తప్పు.. అంటూ మాట్లాడుకున్నారంతా. కీర్తి అనుభవం ఎంతని? అంటూ నొసలు చిట్లించినవాళ్లు ఎంతో మంది.
ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సావిత్రి గెటప్ లో పాస్ మార్కులు పడ్డాయి. సావిత్రమ్మ పోలికలతో మేకప్ లో తీసుకొచ్చారు. ఒక యాంగిల్ లో సావిత్రమ్మలానే కనిపించింది కీర్తి. గెటప్ ఓకే .. మరి నటరాజస్వామికి స్త్రీ రూపమైన సావిత్రమ్మలా ఆమె ఎలా నటిస్తుందో చూసుకోవాలి అనే కామెంట్స్ వినిపించాయి. టీజర్ వచ్చింది. ఇది చూసి ఎక్కడో చిన్న అనుమానం. బయోపిక్ అన్నారు కదా ? సావిత్రమ్మ ఛాయలు పెద్దగా కనిపించడం లేదే ? అనే కామెంట్స్.
ఎట్టకేలకు మే 9న సస్పెన్స్ కు తెరపడింది. మహానటి మొదటి ఆట పడింది. ప్రేక్షకుడి మాట కూడా పడిపోయింది. అసలు ఈ సినిమాపై ఎలా స్పదించాలో అర్ధం కాని పరిస్థితి ప్రేక్షకుడిది. అసలు సినిమా చూశామా ? ఒక చరిత్ర చూశామా? అనే ఎమోషనల్ స్థితికి వెళ్ళిపోయారు ప్రేక్షకులు. సావిత్రమ్మ పాత్రలో కీర్తి ఎక్కడా కనిపించలేదు. సావిత్రమ్మే కనిపించింది. ఇది అతిశాయోక్తి కాదు. నిజం. సగటు ప్రేక్షకుడి అభిప్రాయం ఇది. సావిత్రమ్మ ను మళ్ళీ బ్రతికించి ఆమెతోనే సినిమా తీశారా ? లేదా సావిత్రమ్మే కీర్తి సురేష్ లోకి వెళ్ళిపోయిందా ? అనే భావన ప్రేక్షకుడికి కలిగింది. ఇనాళ్లుగా వున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. మహానటిని చూసిన తర్వాత మా సావిత్రమ్మే మళ్ళీ వచ్చింది అని ప్రేక్షకుడు మనసారా కీర్తిని అభినందిస్తున్నారు. అదే సందర్భంలో సావిత్రమ్మగా కీర్తి ఎలా చేస్తుందో అని అనుమానాలు పెట్టుకున్న జనాలు మనసారా సారీ చెబుతున్నారు. సావిత్రమ్మ ఎలా అయితే చరిత్రలో నిలిచిపోయిందో మహానటి సినిమా కూడా చరిత్రలో నిలిచిపోతుందని కితాబిస్తున్నారు. ఇకపై సావిత్రమ్మ అంటే అమ్మతోపాటు కీర్తి కూడా మనసులో మెదులుతుందని, ఇకపై కీర్తిలోనూ సావిత్రమ్మను చూసుకుంటామని, ఆ తల్లి చల్లగా వుండాలని దీవెనలు అందిస్తున్నారు. ఒక నటికి ఇంతకంటే గొప్ప సత్కారం ఏముంటుంది?! సాహో.. కీర్తి సురేష్.