కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్ని మోయడం అంత తేలిక కాదు. దానికంటూ ఓ ఇమేజ్ , స్టార్ డమ్ కావాలి. దాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకోగలిగింది కీర్తి సురేష్. `మహానటి`తో కీర్తి ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, కీర్తికి విమర్శకుల ప్రశంసలు దక్కడం, అంతకు మించి జాతీయ అవార్డు వరించడం… ఇవన్నీ – కీర్తి స్టార్ డమ్ ని అమాంతం పెంచేశాయి. అయితే ఇలాంటి స్టార్ డమ్ ని తట్టుకోవడం, దాన్ని కొనసాగించడం అంత తేలిక కాదన్న విషయం కీర్తికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ పోవడం, అవేం కీర్తికి సత్ఫలితాలు ఇవ్వకపోవడం కాస్త ఇబ్బంది పెట్టే విషయమే.
`అరుంధతి`తో అనుష్కకీ ఇలాంటి ఇమేజే వచ్చింది. సడన్ గా టాప్ స్టార్ అయిపోయింది. అయితే.. అనుష్క మాత్రం బాగా జాగ్రత్త పడింది. `అరుంధతి`లాంటి కథలు ఆ తరవాత ఎన్ని వచ్చినా, పారితోషికం ఎంత ఇస్తామన్నా… కరిగిపోలేదు. గ్లామర్ రోల్స్‌ని చేసుకుంటూ తన కెరీర్‌ని బాగా బాలెన్స్ చేసుకోగలిగింది. కమర్షియల్ సినిమాలతో తన ఇమేజ్ పెంచుకుంటూ.. టాప్ స్టార్ గా కొనసాగింది. తన మనసుకి నచ్చిన కథ వచ్చినప్పుడు, ఆ కథని తాను నిలబెట్టగలుగుతాను అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి సినిమాల్ని ఒప్పుకుంది. అందుకే కథానాయికగా ఇన్నేళ్లు కొనసాగింది. ఇప్పుడు కీర్తి చేయాల్సింది కూడా అదే. లేడీ ఓరియెండెట్ కథలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. కమర్షియల్ సినిమాలూ, గ్లామర్ పాత్రలూ చేయాల్సిన టైమ్ వచ్చింది. కీర్తి కూడా వాటి కోసమే అన్వేషిస్తోందట. తెరపై తనని అందంగా చూపించే దర్శకులు, కథల కోసం కీర్తి ఎదురు చూస్తోందని, ఇప్పటికే ఒప్పుకున్న కొన్ని సినిమాల్లో తన స్క్రీన్ ప్రజెన్స్ బాగా ఉండేలా జాగ్రత్తలు పడుతోందని టాక్. కీర్తి చేతిలో `సర్కారు వారి పాట` ఉంది. ఈ సినిమాలో కీర్తి లుక్ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాబోయే సినిమాల్లో కొత్త కీర్తిని చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.