మహానటితో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి సురేష్. ఆ అవార్డుకి కీర్తి అర్హురాలు కూడా. అప్పటి నుంచీ.. ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. అందులో భాగంగా కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా `గుడ్ లక్ సఖీ`. జగపతిబాబు, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరు అమ్మాయి… జాతీయ స్థాయి క్రీడల్లో ఎలా రాణించింది, దురదృష్టవంతురాలైన ఆ అమ్మాయిని అదృష్టం ఎలా వరించింది? అనేదే కథ. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే.. కీర్తిలోని మరో కోణం చూపించే సినిమా అవుతోందనిపిస్తోంది. ఇంత మాసీ క్యారెక్టర్ ఇది వరకు చేయలేదేమో..? ఆ పాత్రలోనూ… భిన్నమైన కోణాలు, పార్శ్వాలూ కనిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి కథలు ఒకే ఫార్మెట్ లో సాగుతుంటాయి. ఏమీ లేని ఓ అమ్మాయి, ఓ కోచ్ సహాయంతో, గెలుపు వైపు ఎలా పయనించింది అన్నదే పాయింటు. ఇదీ అంతే. కాకపోతే.. పల్లెటూరి వాతావరణం, నాటకాల బ్యాక్ డ్రాప్, కథానాయికలోని అమాయకత్వం… ఇవన్నీ కొత్త కలరింగు ఇచ్చేఅవకాశం వుంది. టీజర్ అయితే ఆసక్తికరంగానే ఉంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.