చిరంజీవి – కీరవాణిలది మంచి కాంబినేషన్. ఘరానామొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వీళ్ల కాంబోలో వచ్చాయి. మిగిలిన సినిమాలతో పోలిస్తే చిరుకి కీరవాణి ఇచ్చే సంగీతం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అయితే.. చాలా కాలంగా ఈ కాంబోలో సినిమాలు రాలేదు. మొదట్లో మణిశర్మ, ఆ తరవాత దేవీశ్రీ ప్రసాద్, ఇప్పుడు తమన్… ఇలా సంగీత దర్శకుల్ని మారుస్తూ వచ్చిన మెగాస్టార్, కీరవాణితో కలిసి పనిచేయలేదు.
అయితే ఇప్పుడు ఈ కాంబో మరోసారి చూడొచ్చు. చిరంజీవి కథానాయకుడిగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దీనికి కీరవాణి సంగీతం అందించనున్నారు. బింబిసార విజయంలో.. కీరవాణి ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా `అడగాలే కానీ..` పాట సూపర్ డూపర్ హిట్టయ్యింది. నేపథ్య సంగీతం కూడా ప్లస్ అయ్యింది. అందుకే…కీరవాణిని కంటిన్యూ చేయాలనుకొంటున్నాడు వశిష్ట. చిరు కూడా కీరవాణికే ఓటేశారు. ఎందుకంటే.. ఇదో సోషియో ఫాంటసీ. ఇలాంటి కథలకు కీరవాణి బెస్ట్ ఆప్షన్. అందుకే ఆయన టీమ్ లోకి వచ్చారు. జగదేక వీరుడు – అతిలోక సుందరి లాంటి కథ ఇది. `ముల్లోక వీరుడు` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. చిరు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనున్నారు.