ఢిల్లీ అసెంబ్లీలో అసాధారణ దృశ్యం. మొత్తం 70 మంది సభ్యుల్లో 67 మంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లే. ఉన్నది ముగ్గురే ప్రతిపక్ష సభ్యులు. సోమవారం జన్ లోక్ పాల్ బిల్లును ప్రవేశ పెట్టే సమయంలో ఆ ముగ్గురు బీజేపీ సభ్యులు కూడా లేరు. సభనిండా అధికార పార్టీ సభ్యులే.
ఆప్ సభ్యురాలు అల్కా లాంబాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యుడు ఓపీ శర్మను నాలుగు రోజుల క్రితం సస్పెండ్ చేశారు. సోమవారం నాడు బీజేపీ సభ్యుడు విజేందర్ గుప్తా ఆప్ సర్కార్ ప్రతిపాదించిన లోక్ పాల్ బిల్లుపైనా, ఓపీ శర్మ సస్పెన్షన్ పైనా నిరసన తెలిపారు. ఆప్ వైఖరిపై మండిపడ్డారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ఆయనపై విమర్శల వర్శం కురిపించారు. ఈ దశలో, సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లాలని స్పీకర్ ఆదేశించారు. ఆయన నిరాకరించడంతో మార్షల్స్ చేత బయటకు గెంటించారు. ఆప్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మూడో బీజేపీ సభ్యుడు కూడా వాకౌట్ చేశారు,
ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా లోక్ పాల్ బిల్లును ప్రవేశ పెట్టే సమయంలో ప్రతిపక్షం అనేదే లేదు. అంతా అధికార పార్టీ సభ్యుల సమక్షంలేనే బిల్లులను ప్రవేశపెట్టడం చర్చించడం జరిగిపోయాయి.
కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన లోక్ పాల్ మహా జోక్ పాల్ అంటూ ఒకప్పుడు కేజ్రీవాల్ తో పాటు అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాది శాంతిభూషణ్, ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని, మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా ఢిల్లీ ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేలా, పూర్తి స్థాయిలో ఢిల్లీ సర్కార్ కనుసన్నల్లో లోక్ పాల్ పనిచేసేలా బిల్లును రూపొందించారని వారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించే అవకాశం లేదన్నారు. ఎల్ జి తిరస్కరించగానే, కేంద్ర ప్రభుత్వం జన్ లోక్ పాల్ కు అడ్డుతగులుతోందని ఆరోపించి, లోక్ పాల్ ను అటకెక్కించాలనేది కేజ్రీవాల్ కుట్ర అని ఆరోపంచారు. సోమవారం నాడు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ తదితరులు ఈ బిల్లుకు వ్యతిరేకగా ప్రదర్శన చేసి అరెస్టయ్యారు.
కేంద్రం, ఎల్ జి ఒప్పుకోవడానికి వీల్లేని నిబంధనలను ఉద్దేశ పూర్వకంగా పొందు పరిచారనే ఆరోపణ నిజమైతే, అంతకన్నా దారుణం మరొకటి లేదు. బిల్లు ఆమోదం పొందని విధంగా తయారు చేసి, కేవలం బీజేపీని తిట్టడానికి ఓ పావులా వాడుకుని అసలు బిల్లును అటకెక్కించాలనేది కేజ్రీవాల్ వ్యూహమైతే, అంతకంటే మోసం ఉండదు. ఇంతకీ ఏది నిజమో ఏది అబద్ధమో వేచిచూద్దాం.