డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, భాజపాలపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఆ రెండు పార్టీలు నిత్యం కీచులాడుకొంటూ కలిసి జీవిస్తున్న భార్య భర్తల వంటివి. అంటే మిష్టర్ అండ్ మిసెస్ వంటివన్న మాట. అటువంటి భార్యా భర్తలకి ఒకరిగురించి మరొకరికి పూర్తిగా తెలిసి ఉన్నట్లుగానే, ఆ రెండు పార్టీలకి కూడా ఒకదాని తప్పులు, లోపాలు, బలహీనతలు, అవినీతి గురించి మరొకదానికి క్షుణ్ణంగా తెలుసు. అందుకే అవి కీచులాటలకే పరిమితం అవుతాయి తప్ప, ఎన్నడూ ఒకదాని రహస్యాలు మరొకటి బయట పెట్టుకోవు. యూపియే ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలలో ఎవరెవరి హస్తం ఉందో భాజపా నేతలకు తెలుసు. అలాగే భాజపా నేతల అవినీతి, అక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే అవి ఒకదానితో మరొకటి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. యూపియే హయంలో రక్షణ రంగంలో జరిగిన భారీ అవినీతి గురించి రక్షణ మంత్రి మనోహర్ పారిక్కర్ వద్ద వివరాలున్నాయి. కానీ వాటిని ఆయన బయటపెట్టరు. పెడితే కాంగ్రెస్ పార్టీ కూడా భాజపా నేతల అవినీతి భాగోతాలు బయటపెడుతుంది. రెండు పార్టీలు కలిసి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయి,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
గత రెండేళ్ళ మోడీ పాలనలో ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆరోపణలు రాలేదు కానీ యూపియే ప్రభుత్వ హయాంలో జరిగిన నేషనల్ హెరాల్డ్ పత్రిక, అగస్టా హెలికాఫ్టర్లు, నేవీ ట్యాంకర్ షిప్పుల కొనుగోలు కుంభకోణాలు బయట పడ్డాయి. వాటిపై ఆ రెండు పార్టీలు చాలా తీవ్రంగా పోరాడుకొన్నాయి. వాటిపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్తంభింపజేసింది. కానీ ఇంతవరకు మోడీ ప్రభుత్వం ఒక్కరిని కూడా దోషిగా న్యాయస్థానం ముందు నిలబెట్టలేదు. “ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా దమ్ముంటే కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యొచ్చు కదా?” అని సోనియా గాంధీ మోడీ ప్రభుత్వానికి సవాలు విసిరినా పట్టించుకోకపోవడం గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనుమానించవలసి వస్తోంది. బొగ్గు గనుల అక్రమ కేటాయింపులు, నేషనల్ హెరాల్డ్ కేసులు కోర్టుల వరకు వచ్చేయి కానీ ఆ తరువాత మళ్ళీ వాటి జాడే లేదు. అంటే అవినీతి జరగలేదనా? లేకపోతే ఆ అవినీతి కేసులని పక్కనపెట్టినట్లు అనుకోవాలా?