ఎదుటి వారికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈ విషయం బాగానే తెలిసినట్టుంది. నీతివంతమైన రాజకీయాలు, అవినీతిపై ఉద్యమం అంటూ సుద్దులు చెప్తారు. మిగతా రాజకీయ పార్టీలకు తీసిపోని విధంగా తన పార్టీని నడిపిస్తారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సీఎం పదవి లేదా అదే తరహాలో మాంచి ఆఫర్ ఇచ్చారనే ప్రచారం నిజమైతే, ఈ విషయం మరోసారి రుజువవుతుంది.
ఒక మనిషిని కొట్టి చంపిన కేసులో సిద్ధూ దోషి. జైలుకు కూడా వెళ్లాడు. ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడు. 1988లో పంజాబ్ లోని పాటియాలాకు చెందిన గుర్నాం సింగ్ అనే వ్యక్తి తన కారుకు అడ్డువచ్చాడని సిద్ధూ దాడి చేశాడు.
అతడిని కారులోంచి బయటకు లాగి విపరీతంగా కొట్టాడు. రక్తం కారుతున్నా ఇష్టం వచ్చినట్టు చితకబాదాడు. ఈ దెబ్బలకు అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సిద్ధూ నిర్దోషి అని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టివేసింది. సిద్ధూ దోషి అని తేల్చింది. ఒక మనిషిని కొట్టి చంపినందుకు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2006 డిసెంబర్లో తీర్పు చెప్పింది. దీంతో సిద్ధూను పాటియాలా జైలుకు తరలించారు.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీం కోర్టుకు వెళ్లాడు. అక్కడ అతడికి బెయిల్ లభించింది. అప్పుడు పాటియాలా జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. అతడికి బెయిల్ లభించిందే గానీ, నిర్దోషి అని సుప్రీం కోర్టు ఇంకా తీర్పు చెప్పలేదు. విచారణ తర్వాత సుప్రీం కోర్టు తీర్పు ఏమిటో తెలియదు. ప్రస్తుతానికి అతడు మూడేళ్లు జైలు శిక్ష పడిన దోషి కిందే లెక్క.
ఇంత జరిగిన తర్వాత కూడా బీజేపీ అతడికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఇటీవలే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసింది. బీజేపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తుందని విమర్శించే కేజ్రీవాల్ ఒకవేళ సిద్ధూను స్వయంగా తన పార్టీలోకి ఆహ్వానించి ఉంటే ఈ నీతి వాక్యాలు ఏమయ్యాయి అనేది ప్రశ్న. పైగా సిద్ధూకు సీఎం పదవి గానీ, పెద్ద స్థాయిలో ఏదో పదవి గానీ ఆఫర్ చేశారని ప్రచారం జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచీ మీడియాలో ఈ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే, మనిషిని చంపిన కేసులో జైలు శిక్ష పడిన వ్యక్తిని ఏరికోరి సీఎం అభ్యర్థిగా చేయడమే నీతివంతమైన రాజకీయమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి కేజ్రీవాల్ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది.
పంజాబ్ లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని ఆప్ కోరుకోవడంలో తప్పులేదు. అందుకోసం విచిత్రమైన విన్యాసాలు చేయడమే విచిత్రం. ఇప్పటికే ఢిల్లీలోని సర్కారీ స్కూళ్లలో పంజాబీ టీచర్ ఉండటం తప్పనిసరి అని కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబీ భాషను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటూ నగరంలో హోర్డింగులు వెలిశాయి. ఇప్పుడు సిద్ధూ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.