నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నేటితో రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం సుమారు 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వాళ్ళ ట్వీటర్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. రెండేళ్ళ పాలన పూర్తయితే దాని ప్రచారం కోసం అంత ప్రజాధనం వృధా చేయాలా? అని ప్రశ్నించారు. ఆయన ప్రశ్న సమంజసంగానే ఉంది. అయితే దాని క్రిందనే తన ప్రభుత్వం ప్రచారం కోసం చేస్తున్న వృధా ఖర్చుల గురించి కూడా చిన్న వివరణ ఇవ్వడం విశేషం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంపై కూడా సరిగ్గా అటువంటి ఆరోపణలే వస్తున్నాయి. తన ప్రభుత్వంలో అన్ని శాఖలు కలిపి ఒక ఏడాది మొత్తంలో కేవలం రూ. 150 కోట్లు మాత్రమే ఖర్చు చేశాయని ఆయనే స్వయంగా తన మెసేజ్ లో పేర్కొన్నారు. ఒక డిల్లీకి మాత్రమే పరిమితమైన ఆమాద్మీ ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు ప్రచారంపై ఖర్చు చేయడం అవసరమా? అని డిల్లీ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి పని తక్కువ ప్రచారం ఎక్కువా అయ్యిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తన ప్రభుత్వం 150 కోట్లు ప్రచారంపై ఖర్చు చేసిందని ఒప్పుకొంటూనే, మళ్ళీ నరేంద్ర మోడీ 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. మోడీ ప్రభుత్వం చేస్తున్నది ఆయనకి తప్పుగా కనిపిస్తున్నప్పుడు, తన ప్రభుత్వం కూడా అదే తప్పు కొంచెం తక్కువ స్థాయిలో చేస్తోందని ఎందుకు గ్రహించడం లేదు? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ని తప్పు పడుతున్న భాజపా కూడా అదే తప్పు ఎందుకు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు.
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత డిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యాయాలలో చాలా పొదుపు చర్యలు ఖచ్చితంగా అమలు చేయిస్తున్నారని, దాని వలన ప్రభుత్వానికి చాలా ఖర్చు తగ్గించారని మాటలు వినపడుతుంటాయి. అక్కడ వందలు, కొన్ని వేలు లేదా కొన్ని లక్షలు మిగిలించి, ఈవిధంగా ఒకేసారి ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడం వలన ఎంత పొదుపు చేసినా ఏమి మిగులుతుంది? ఏమి ప్రయోజనం?
ఏపిలో హూద్ హూద్ తుఫాను వచ్చినప్పుడు మోడీ రూ.1,000 కోట్లు ఆర్ధిక సహాయం ఇస్తామని ప్రకటించారు. కానీ నేటికీ దానిలో కొంత ఇవ్వనేలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ వెయ్యి కోట్లు ఉంటే ఒక జిల్లా అంతటిని సరిచేసేందుకు అవకాశం ఉందని అర్ధమవుతోంది. ప్రజాధనాన్ని అటువంటి ముఖ్యమైన పనులకు వినియోగించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. చాలా అవసరమైన చోట ఖర్చు చేయకుండా ఈవిధంగా ప్రచారం కోసం దుర్వినియోగం చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్షించలేకపోతున్నారు.