అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం పీఠం ఏమవుతుందో అనే భయం కల్పిస్తున్నారు. అయినా కేజ్రీవాల్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన పోరాటం చేస్తున్నారు. వ్యవస్థల మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. అంతిమంగా న్యాయస్థానమే కావడంతో ఆయన పోరాటం చేస్తున్నారు. కానీ తాను ఎక్కడా తగ్గేది లేదని నిరూపిస్తున్నారు.
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా తన కేసు గురించి కేజ్రీవాల్ తానే వాదించుకున్నారు. ఎవరైనా లాయర్ ను పెట్టుకుంటే కస్టడీకి ఇవ్వొద్దని వాదించుకుంటారు. కానీ కేజ్రీవాల్ వేరు. ఈడీకి ఎన్ని రోజులు కస్టడి కావాలంటే అన్ని రోజులు ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తికి చెప్పారు. ఈ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేసేందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని కేజ్రీవాల్ కోర్టు ముందు వాదించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల ఛార్జిషీట్లో, ఈడీ దాఖలు చేసిన 25వేల పేజీల ఛార్జిషీట్లో ఎక్కడా తన పేరు లేదని … అయినా తనను ఎందుకు అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
కేసులో ఇరికించడమే లక్ష్యంగా ఈడీ అధికారులు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ వాదించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చి 7 స్టేట్మెంట్లలో 6 స్టేట్మెంట్లలో తన పేరు లేదని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత రూ. 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఇచ్చాడని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. శరత్ చంద్రారెడ్డితో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు రెండు లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్.. అందులో ఒకటి తనను ఈ కేసులో ఇరికించడం.. రెండోది ఆప్‌ను లేకుండా చేయడమేనని కోర్టు ముందు చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో కానీ.. అది పూర్తిగా రాజకీయ కోణంలో అవసరమైనప్పుడే తెరపైకి వస్తున్న కేసన్న అభిప్రాయం జనంలో ఉంది. ఈ విషయంలో కేజ్రీవాల్ బాధితుడిగా ప్రజల మద్దతు పొందుతున్నారనుకోవచ్చు.. దీనికి కారణం ఈడీ యాక్షన్ చేస్తున్న టైమింగే కారణం అనుకోవచ్చు.