అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయ నేతగా ఆవిర్భవించిన మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీవాల్ సంప్రదాయ రాజకీయనేతలకు మించిన రాజకీయాలు చేశారు. ప్రజల్ని భావోద్వేగాలతో రెచ్చగొట్టి ఓట్లు వేయించుకునేందుకు ఆయన చేయాల్సినవి చేశారు. ఆయన చెప్పిన కొత్త తరహా రాజకీయాలు.. చేసిన ప్రచారం కొంత మేర వర్కవుట్ అయింది. కానీ ఇప్పుడు ఆ రాజకీయాలపై కూడా ప్రజలకు విరక్తి చెందారు. ఆ విషయం ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టమయింది.
ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టినప్పుడు చాలా మంది చదువుకున్న వారు ఆ పార్టీ సభ్యులుగా మారారు. ఇప్పటికీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు ప్రముఖులు కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చిన వారే నేతలు. కానీ వారంతా ఇప్పుడు రాజకీయ నేతలు అయిపోయారు. ఉద్యమకారుల లక్షణాలు ఉంచుకోలేదు. ఇతర రాష్ట్రాల్లో ఎదుగుతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు కేజ్రీవాల్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ ప్రజలు ఆప్ ను నమ్మే అవకాశం లేదు.
గతంలో గుజరాత్, గోవా, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని విస్తరించే ప్రయత్నం చేశారు. ఒక్క పంజాబ్ లో మాత్రమే.. అక్కడ జాతీయ పార్టీలపై ప్రజల విరక్తితో చివరికి ఆప్ ను ఎన్నుకున్నారు. అక్కడి ముఖ్యమంత్రి తీరుతో.. అక్కడా వచ్చే సారి ఉంటుందో.. పడుతుందో తెలియని పరిస్థితి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేయాలని.. చాలా అనుకున్నారు కేజ్రీవాల్. ఇప్పుడు తన పార్టీ ఉనికికే సమస్య వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్ ముందు చాలా కఠిన పరిస్థితులు ఉన్నాయి. క్యాడర్, లీడర్ ఆ పార్టీలో ఉండటం.. ఉంచేలా చేయడం అంత తేలిక కాదు. తన నాయకత్వాన్ని నమ్మి.. ఉండాలని అందర్నీ కేజ్రీవాల్ నమ్మించగలగాలి. లేదా ఆప్ చరిత్రలో కలిసిపోతుంది.