డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంపై సిబిఐ దాడులు చేసినందుకు మోడీ ప్రభుత్వం పశ్చాతాపపడే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఎదురుదాడితో మోడీ ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా ఆయన చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పదేపదే సంజాయిషీలు ఇచ్చుకొంటూనే మళ్ళీ కేజ్రీవాల్ ని ఎదుర్కోవలసి వస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి చాల చికాకు కలిగించే అంశమే కానీ అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.
అరుణ్ జైట్లీ ఇదివరకు 13సం.ల పాటు డిల్లీ జిల్లా క్రికెట్ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ సమయంలో డిల్లీలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అసలు కంటే రెట్టింపు ఖర్చయినట్లు లెక్క చూపించి సుమారు రూ.50 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ కుంభకోణంపై తమ ప్రభుత్వం విచారణ చేస్తునందున, సిబిఐ అధికారులను తన కార్యాలయంపైకి పంపించి, అందుకు సంబంధించిన ఫైళ్ళ కోసం శోదాలు నిర్వహింపజేసారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఆ కుంభకోణంతో తనకు సంబంధం లేదని అరుణ్ జైట్లీ భావిస్తున్నట్లయితే, దానిని చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అరుణ్ జైట్లీ మీడియా సమక్షంలో తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు ఖండించినందున ఆయనని నిర్దోషిగా భావించవచ్చనుకొంటే, 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణంలో నిందితులు కూడా అదే పనిచేస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నించారు.
అరవింద్ కేజ్రీవాల్ కి బిహార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమతా బెనర్జీ మద్దతు పలకడంతో అరుణ్ జైట్లీ ఇంకా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కేజ్రీవాల్ ఆరోపణలను మొదట చాలా తేలికగా తీసుకొన్న ఆయన ఇప్పుడు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. మొదట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని విమర్శించినప్పటికీ, ఇప్పుడు కేంద్రమంత్రులెవరూ కూడా ఈ వాగ్వాదంలో జైట్లీకి అండగా నిలబడకపోవడంతో ఆయనొక్కరే కేజ్రీవాల్ ని, ఆయనకు మద్దతు ఇస్తున్న నితీష్ కుమార్ మరియు మమతా బెనర్జీని కూడా ఎదుర్కోవలసివస్తోంది. సిబిఐ అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి తెలియపరచకుండా డిల్లీ సచివాలయంపై దాడులు చేసినందుకే కేంద్రప్రభుత్వం విమర్శలు మూటగట్టుకొంటుంటే, అరుణ్ జైట్లీపై కేజ్రీవాల్ చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణల వలన ఇంకా అప్రదిష్ట కలుగుతోంది. బహుశః కేజ్రీవాల్ ని కెలికినందుకు మోడీ ప్రభుత్వం కూడా ఇప్పుడు పశ్చాతాపపడుతోందేమో?