ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్… ఇప్పుడు తన అధికారిక నివాసం ఖాళీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం తను ఉంటున్న ఇల్లు హైసెక్యూరిటి జోన్ లో ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఖాళీ చేశాక, ఆయన ఎక్కడ ఉంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సీఎం ఉంటున్న నివాసంలోకి కొత్త సీఎం అతిషీ మారే అవకాశం ఉండగా… కేజ్రీవాల్ ఢిల్లీలోనే మరో నివాసంకు మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో కొత్త నివాసం కోసం వెతుకుతున్నామని, అయితే… తనకు భద్రత ఎలా ఉంటుందో అన్న అనుమానాలున్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటించారు.
నిజానికి తాము లిక్కర్ కేసులో బెయిల్ వస్తుందని అనుకోలేదని… సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వటంతో ఆప్ తో పాటు ఢిల్లీ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారన్నారు. కానీ, కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలని నిర్ణయించారని, ఇది ఢిల్లీ ప్రజలకు ఇష్టం లేని చర్యగా అభివర్ణించారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ కు సొంత నివాసం లేదు. దీంతో ఆయన ఢిల్లీని వీడుతారా అన్న ప్రచారం కూడా మొదలైంది. కానీ, తాను ఢిల్లీని వీడే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారని, ఢిల్లీ ప్రజలతోనే ఉండబోతున్నారని… అందుకే కొత్త ఇంటి కోసం వెతుకుతున్నామని, వారం రోజుల్లో అధికారిక నివాసం ఖాళీ చేయబోతున్నట్లు ప్రకటించారు.