మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. ఢిల్లీ ఓటరు మరొకసారి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పటి వరకు ఉన్న ఫలితాలను చూస్తే, 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో దాదాపుగా 50 సీట్ల లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంటే, మిగిలిన 20 స్థానాల్లో మాత్రం బిజెపి ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఖాతా తెరవలేదు.
2015లో 67 స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బిజెపి కి అప్పుడు కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం బిజెపి మొత్తం 7 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. లోక్సభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడ్డాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ పట్టు నిలుపుకుంది. మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 37 ని దాటేసి దాదాపు 50 స్థానాల వద్ద కొనసాగుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, స్వచ్ఛమైన పాలన తమను గెలిపించాయని వాదిస్తూ ఉంటే, బిజెపి మాత్రం కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లోపాయికారీగా కుమ్మక్కు కావడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిందని, 22 శాతం ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం రెండు శాతం ఓటింగ్ కు పరిమితం అయింది అని, కేవలం బిజెపి ని నిలువరించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సహకరించిందని బీజేపీ నేతలు అంటున్నారు.
పూర్తి ఫలితాల అనంతరం ఈ మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ ప్రెస్ మీట్ లో ఏమి మాట్లాడతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.