ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను అరెస్టు చేయడం బీజేపీకి రాజకీయంగా ఎంత నష్టమో నిరూపించాలని కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ వేశారు. అందు కోసం ఆయన ముందుగా తన పదవిని త్యాగం చేస్తున్నారు. రెండు రోజుల్లో తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ప్రభుత్వాన్ని రద్దు చేయబోవడం లేదు. మరో వ్యక్తిని సీఎంను చేస్తారు. అయినా సరే నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది.
కేజ్రీవాల్ తనను తాను నిర్దోషిగా బయటపడేవరకూ పదవి చేపట్టబోనని.. తనకు గిల్టీగా ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎన్నో ఏళ్లు కోర్టుల్లో ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. మరి అప్పటి వరకూ పదవులు చేపట్టారా అనే డౌట్ రాకుండా.. తాను ప్రజా కోర్టుకు వెళ్తున్నట్లుగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ ఎజెండాను అలా ఫిక్స్ చేశారన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు ప్రజలు ఓటేస్తే తనను వారు నిర్దోషిగా ప్రకటించినట్లే. అప్పుడు పదవి చేపడతారు. ఇప్పుడు … రాజీనామా చేయడం ద్వారా ఆయన ప్రజల నుంచి సానుభూతి పొందుతున్నారు. ప్రజలకు ఎంతో విలువ ఇచ్చినట్లుగా కూడా ఆయన రాజకీయం చేస్తున్నారు.
కేజ్రీవాల్ తన వ్యూహం వల్ల మరో మూడు , నాలుగు నెలల పాటు ఢిల్లీ సీఎం పదవికి దూరమవుతారేమో కానీ.. మూడో సారి అధికారంలోకి రావడానికి ఆయన మాస్టర్ ప్లాన్ వేశారని అనుకోవచ్చు. కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ ప్రజలకు అభిమానం ఉంది. పాలనలో ప్రత్యేకత చూపారు. పరిమిత అధికారాలతోనే చాలా తేడా చూపించారు. అదే సమయంలో బీజేపీ చేస్తున్న రాజకీయానికి విరుగుడుగా తీసుకుంటున్న నిర్ణయలు కూడా బీజేపీని మించి ఉంటున్నాయి
కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఇప్పుడు బీజేపీకి గట్టి దెబ్బే. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజుల తరబడి జైల్లో పెట్టారు కానీ.. సాక్ష్యాల చూపించలేకపోయారన్న వాదన ఉంది. కోర్టుల్లోనూ వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ పెద్దల అరెస్టుల రాజకీయానికి.. కేజ్రీవాల్.. తనదైన పదవీ త్యాగం నిర్ణయంతో గట్టి షాక్ ఇస్తున్నారని అనుకోవచ్చు.