భారతీయ జనతా పార్టీని చూసి ఇప్పుడు భయపడని ప్రాంతీయ పార్టీ లేదు. ఎదురొడ్డి నిలబడతామనుకున్న పార్టీలన్నీ.. శంకరగిరి మాన్యాలు పట్టాయి. మిగిలిన పార్టీలు తమకూ ఆ గతి పట్టకుండా.. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు కేజ్రీవాల్ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ అంటే అవినీతి, అవినీతి అంటే బీజేపీ అన్నట్లుగా కేజ్రీవాల్ ఆరోపణాస్త్రాలు సంధించేవారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ పదే పదే ఆరోపించారు. అనునిత్యం బీజేపీతో బస్తీమే సవాల్ అని మాటల యుద్దానికి దిగే కేజ్రీవాల్.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు చూసుకుని మెత్తబడిపోయారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరుగుతున్నాయి. అందుకే కేజ్రీవాల్ ఇప్పుడు బీజేపీతో సంధి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దిశలోనే అనేక సంకేతాలు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు మోదీ సర్కారుపై ఒంటికాలి మీద లేచిన కేజ్రీవాల్.. ఇప్పుడు మాత్రం రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారంపై కృతజ్ఞతలు చెప్పేందుకే బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం అందించిన సాయంపై తాజా హోర్డింగుల్లో ప్రస్తావన లేకపోవడం తమ తప్పేనని, ఇకపై అలాంటి పొరపాట్లు జరగబోవని కేజ్రీవాల్ హామీ ఇవ్వడం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా సొంత పార్టీ వారిని సైతం ఆశ్చర్యానికి లోనుచేసింది. ఢిల్లీలోని ఏడు లో్క సభ స్థానాల్లో ఆప్ ఒక్క చోట కూడా గెలవలేదు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడం, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి రెండో స్థానానికి ఎగబాకడంతో ఆప్ పునరాలోచనలో పడింది. లోక్ సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌తో చేతులు కలిపి పోరాటాలు చేసిన జాతీయ, ప్రాంతీయ నేతలంతా ఇప్పుడు బలహీనపడటంతో తనకూ ఆ దుస్థితి రాకూడదని ఆయన భావిస్తున్నారు.
బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్…కూడా కేజ్రీవాల్లో కొత్త భయాలు కల్పిస్తోంది. కర్ణాటక, గోవా తరహాలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకుంటే చేయగలిగిందేమీ లేదని ఆప్ అనుమానిస్తోంది. పైగా ఎమ్మెల్యేలను భయపెట్టి తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ చేతుల్లో చాలా అస్త్రాలే ఉన్నాయి. భయపెట్టి ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు లాక్కొన్నా ఆశ్చర్యం లేదని ఆప్ వర్గాలు అంటున్నాయి. అందుకే లోక్ సభ ఫలితాలు వెల్లడించిన వెంటనే కేజ్రీ ప్లేటు ఫిరాయించారు. మర్యాద పూర్వకంగా మోదీని కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరు నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం.. కొత్త వ్యూహం రెడీ చేసుకుంటున్నారు.