హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న హెచ్‌సీయూ విద్యార్థులను కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. తర్వాత వారినుద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యార్థులపై పోరు సాగిస్తోందని అన్నారు. విద్యార్థులతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. యువకులు, విద్యార్థులు తిరగబడితే కేంద్రంలో బీజేపీ పీఠం కూలిపోతుందని అన్నారు. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల పీఠాలపై ఆర్ఎస్ఎస్ భావజాలమున్నవారిని కూర్చోబెడుతున్నారని ఆరోపించారు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా గజేంద్ర చౌహాన్ అనే అనర్హుడిని కూర్చోబెట్టారని, దానికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారని గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాలు చర్చకు వేదికలని అన్నారు. ఇక్కడ చర్చించే స్వేచ్ఛను అణగదొక్కితే అనర్థమని చెప్పారు. కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని రోహిత్ ఆత్మహత్యపై అన్నీ అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ఘటనను పక్కదోవ పట్టించటానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రోహిత్ లాంటి ప్రతిభావంతుడైన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం దేశానికి సిగ్గుచేటని అన్నారు. సుశీల్ అనే విద్యార్థిపై దాడి జరిగిందనటం అవాస్తవమని చెప్పారు. సుశీల్‌కు రక్షణ కావాలని అతని తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్ అఫిడవిట్ దాఖలు చేశారని, దానిలో సుశీల్‌పై దాడి జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారని కేజ్రీవాల్ అన్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌పై తాను వీసీతో మాట్లాడదామని అనుకున్నామని, అయితే సమస్య తమ సస్పెన్షన్ కాదని, వీసీని తొలగించటమే తమ ప్రధాన డిమాండ్ అంటూ విద్యార్థులు వారించారని చెప్పారు. వీసీని తక్షణమే తొలగించాలనిడిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు తాను అండగా ఉంటానని చెప్పారు. కేజ్రీవాల్ జై భీమ్ అని, రోహిత్ అమర్ రహే అని నినాదాలు కేజ్రీవాల్ చేశారు.