ఢిల్లీ మెట్రో రైలు మెజెంటాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 12 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో కలసి ప్రధాని ప్రయాణించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రైలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై డిసెంబర్ 25ని సత్పరిపాలన దినంగా తమ ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు. నొయిడా వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా పదవి కోల్పోతారనే సెంటిమెంట్ ఉందనీ, దాన్ని యోగి ఆదిత్యనాథ్ బ్రేక్ చేశారంటూ మోడీ మెచ్చుకున్నారు. ఆయన కాషాయం కట్టుకున్నా ఆలోచనలు హైటెక్ లో ఉంటాయని యోగి పొగడ్తలతో ముంచారు.
ఈ మెట్రో రైలు ప్రారంభోత్సవాన్ని భాజపా ప్రచార కార్యక్రమంగా మోడీ మార్చేశారు అనొచ్చు! అంతేకాదు, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా పిలవాల్సిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థావన కూడా ఎక్కడా రానీయకుండా మోడీ మాట్లాడటం విశేషం. నిజానికి, ఈ మెట్రో లైను నొయిడా నుంచి ఢిల్లీ వరకూ ఉంది. అంటే, ఇది ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం యాభై శాతం నిధులు ఇచ్చింది. కనీసం ప్రోటోకాల్ ప్రకారమైనా ఢిల్లీ ముఖ్యమంత్రిని పిలవాలి. ఆ ఊసే లేకుండా ఇదంతా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘనతే అన్నట్టుగా, భాజపా విజయం అన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడేయడం విశేషం.
దీంతో ఆమ్ ఆద్మీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిని ఇలా అవమానించడం ఇది మూడోసారి అంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రో ప్రాజెక్టుకు ఖర్చు చేసిన యాభై శాతం నిధులూ తమకు వాపసు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ దగ్గర ప్రస్థావిస్తే.. ఆయన సమాధానం చెప్పకుండా నవ్వేశారు. పదేపదే మీడియా ప్రశ్నిస్తున్నా.. హ్యాపీ క్రిస్మస్ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. నిజానికి, అరవింద్ కేజ్రీవాల్ స్పందన కూడా తన రొటీన్ తీరుకు భిన్నమైందిగానే ఉంది. అవకాశం దొరికితే చాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించేవారు. కానీ, గడచిన కొన్ని నెలలుగా ఆయన తన పనేదో తనది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ మెట్రో విషయమై ఇంత అవమానం జరిగినా కూడా ఆయన స్పందించకపోవడం వ్యూహాత్మకమే అనుకోవచ్చు. ఎందుకంటే, తమ పట్ల కేంద్రంలోని భాజపా అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు చూస్తున్నారనీ, భాజపా చిన్నచూపును సరైన సమయంలో తిప్పికొట్టొచ్చు అనే ఆలోచనతో కేజ్రీవాల్ ఉన్నారనీ కొంతమంది అంటున్నారు. ఏదేమైనా, ఢిల్లీ మెట్రో రైలు ప్రారంభానికి ఢిల్లీ ముఖ్యమంత్రినే పిలవకపోవడం సరైంది కాదనే చెప్పొచ్చు.