దేశ ఆర్ధిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి ?. ఆర్థిక నిపుణులు.. ఏవేవో చెబుతారు.. అవన్నీ మనకు అర్థం కావు. కానీ కొంత మంది చాలా సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. వాటిని చెబుతారు. నిజమా ఇంత సింపులా అని మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఏం చేయాలా అని చాలా మంది నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. ఆర్బీఐ అయితే.. వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. కానీ ఇలాంటి పనులన్నీ దండగని.. కరెన్సీ నోట్లపై లక్ష్మి దేవి, వినాయకుడి బొమ్మలను ముద్రిస్తే చాలని ఓ సలహా ప్రముఖ వ్యక్తి దగ్గర్నుంచి దూసుకొచ్చింది.
సాధారణంగా ఇలాంటి సలహాలిచ్చేవారు బీజేపీ వారు అయి ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి సలహా కేంద్రానికి ఇచ్చింది బీజేపీ కాదు.. కేజ్రీవాల్. గుజరాత్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన నోట్లపై మహాత్మ గాంధీతో పాటు లక్ష్మిదేవి, గణేశుని విగ్రహాలు ముద్రించాలంటున్నారు. ఐఐటీలో చదువుకుని ఇండియన్ రెవిన్యూ ఆఫీసర్ క్యాడర్ లో కొంత కాలం పని చేసిన కేజ్రీవాలేనా ఇలా మాట్లాడింది అని చాలా మంది ఆశ్చర్యపోయారు. సెటైర్ అనుకున్నారు. కాదు సీరియస్సేనని ఆయన మాటలను బట్టి అర్థమైపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందని, ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆ దేవుళ్ల దీవెనలు కావాలని ..అందుకే కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి బొమ్మలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని ప్రకటించారు.
నిజంగానే చెప్పినా.. సెటైరిక్‌గా చెప్పినా… ఆర్థిక మేధావులు ఏవోవో లెక్కలేసి.. పెట్టుబడులు పెంచాలి.. వడ్డీ రేట్లు వడ్డించాలి… మనీ ఫ్లో తగ్గించాలి.. లేకపోతే మరో రకంగా చేయాలని ఇచ్చే సలహాల కన్నా.. ఇలా సింపుల్‌గా కరెన్సీ నోట్లపై దేవుడి బొమ్మలు వేసి… దండం పెట్టుకుంటే చాలనే సూత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లో మెజార్టీకి నచ్చుతుంది. కేజ్రీవాల్‌కు కూడా కావాల్సింది అదే.