తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్ . కృష్ణయ్యే అనే బీసీ సంఘాల పేరుతో హడావుడి చేసే అనామక వ్యక్తిని తెచ్చి చంద్రబాబు సీఎం అభ్యర్థిని చేశారు. బీసీలంతా ఓట్లేస్తారని ఆయన అనుకున్నారు. ఏ ఆశలూ లేని చోట ఓ రాయి వేయడం అన్నమాట. ఇప్పుడు కేరళలో బీజేపీ కూడా అదే చేస్తోంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్ను తమ సీఎం అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించింది. ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపారు. శ్రీధరన్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
దేశంలో మెట్రో రైళ్ల మార్గదర్శకుడిగా పేరు పొందిన ఈ. శ్రీధరన్ కు పేరుంది. శ్రీధరన్ నేతృత్వంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది. అంతేకాదు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. కాంగ్రెస్ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు లభించాల్సినంత గౌరవం లభించలేదు. పలుమార్లు ఆయనకు అవమానం జరిగింది. కీలకమైన ప్రాజెక్టులకు ఆయన సేవలు తీసుకోకుండా పక్కన పెట్టేశారు. 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్ను పట్టించుకోకుండా.. వేదికపై ఓ పక్కన నిలబెట్టేశారు. ఈ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
కొన్నేళ్లుగా ఆయన స్వంత రాష్ట్రం కేరళలోనే ఉంటున్నారు. ఎన్నో మెట్రో ప్రాజెక్టులు చేస్తున్నా.. ఆయన సలహాలు తీసుకోవడం లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయనను తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించింది. ఆయన కూడా రెడీ అయ్యారు. బీజేపీ విభిన్నమైన పార్టీ అని… బీజేపీ వస్తేనే కేరళ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఆయనే సీఎం అభ్యర్థి అనే ప్రచారం కూడా ప్రారంభించేశారు. కేరళలో బీజేపీకి ఎలాంటి బలం లేదు. ఏదో విధంగా అక్కడ పాగా వేయాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. శబరిమల వివాదం ఉద్ధృతంగా సాగినప్పుడు కూడా పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు.. శ్రీధరన్ను పార్టీలో చేర్చుకుని మరో ప్రయోగం చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.