అల్లు అర్జున్‌కి కేరళ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. త్వరలో అక్కడ జరగబోయే ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనాల్సిందిగా పిలుపు అందింది. బన్నీకి కేరళలోనూ భారీ స్థాయిలో అభిమానులున్న సంగతి తెలిసిందే. అక్కడ బన్నీని మల్లూస్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈమధ్య కేరళ తుపాను దాటికి విలవిలలాడింది. పచ్చని ఆ సీమలో ఆర్తనాదాలు వినిపించాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్లని ఆదుకోవడానికి చిత్రసీమ కూడా ముందుకొచ్చింది. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ రూ.25 లక్షల సహాయాన్ని అందించాడు. కేరళని ఆదుకోవాలని తన అభిమానులకు పిలుపు ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే కేరళ కూడా కొంత కోలుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో తమని ఆదుకున్న కొంతమంది స్టార్స్‌ని కేరళ ప్రభుత్వం పిలిచి.. ప్రత్యేకంగా గౌరవించాలని భావిస్తోంది. అందులో భాగంగానే బన్నీకి ఆహ్వానం అందిందా? లేదంటే మరో కారణముందా? అనేది తెలియాల్సివుంది. త్వరలో కేరళ ప్రభుత్వం నిర్వహించే ఓ కార్యక్రమంలో బన్నీ పాల్గొనడం ఖాయం. అదెప్పుడు? సంగతేంటన్నది ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది.