కరోనా వైరస్.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం రూ. ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించింది. వీటిని వ్యవసాయంతో పాటు చిరు వ్యాపారుల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. ఇక అందరికీ ఆహారం, ఉపాధి, ఫ్రీ వ్యాక్సినేషన్ కోసం కూడా విడిగా నిధులు కేటాయించారు. పద్దెనిమిదేళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి పదిహేను వందల కోట్లను కేరళ సర్కార్ మంజూరు చేసింది. ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారి కోసం రూ.8,990 కోట్లు, అవసరమైన వారికి లోన్లు, వడ్డీ రాయితీల కోసం రూ.8,300 కోట్లు కేటాయించారు. మొదటి రెండు దశల్లో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి… వీలైనంత ప్రాణ నష్టం తగ్గించింది.
ఇప్పుడు మూడో దశకు కూడా ముందస్తుగా సన్నాహాలు చేస్తోంది. ప్రతి తాలుకా, జిల్లా, జనరల్ హాస్పిటళ్లల్లో 10 బెడ్లతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రూ.636కోట్లు కేటాయించారు. కరోనాను ఎదుర్కోవడం అంటే.. ప్రకటనల్లో కాకుండా… గ్రౌండ్లో చేసిచూపిస్తున్న ప్రభుత్వంగా కేరళకు మంచి పేరు ఉంది. తొలి దశలో..కరోనా వ్యాప్తి కారణంగా… ముందూ వెనుకా చూసుకోకుండా పెట్టినలాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఇబ్బంది పడ్డారేమో కానీ.. కేరళలో మాత్రం ఎలాంటి ఇబ్బందికలగలేదు. కమ్యూనిటి కిచెన్లు పెట్టి అందరి ఆకలి తీర్చారు. రెండో వేవ్‌లోనూ ఆ ఒరఒడి కొనసాగించారు.
పెద్ద ఎత్తున కేసులు నమోదయినప్పటికీ.. వ్యాక్సిన్ల దగ్గర్నుంచి ఏ విషయంలోనూ లోపాలకు తావివ్వలేదు. దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో అల్లాడితే… కేరళ మాత్రం పొరుగురాష్ట్రాలకు ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు ప్రజల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు నేరుగా నగదు బదిలీ కన్నా.. మళ్లీ వారి వ్యాపారాలు పుంజుకునేలా చేయడానికి పక్కా ప్రణాళికతో వెళ్తోంది.అందుకే దేశంలో… కేరళ ఎప్పుడూప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటుంది.