తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. కేరళలో. నెలలో ఆరు రోజుల జీతాన్ని కత్తిరిచాలని కేరళ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని రెండు నెలల పాటు అమలు చేయకుండా.. అక్కడి హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ఉద్యోగసంఘాలు కోర్టుకెళ్లాయి. కేరళలో వరసుగా ఐదు నెలల పాటు.. ఆరు రోజుల జీతాన్ని ఉద్యోగులకు కత్తిరించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కారణం ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడం. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడంతో కేరళకు ఆదాయం లేకుండా పోయింది. కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటాతో కలిపి.. ఇతర నిధులను జమ చేసుకుని.. జీతాలు ఇవ్వాలనుకున్నారు. అయితే.. సరిపోవడం లేదని ఆరు రోజుల జీతాన్ని కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఐదు నెలల పాటు సాగిస్తే.. కేరళకు.. కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని అనుకున్నారు. ఆ మేరకు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇచ్చేసింది.
అయితే.. ఇది ఉద్యోగ సంఘాలకు నచ్చలేదు. తమ జీతాన్ని కత్తిరించడం ఏమిటని వారు ఆగ్రహం చెంది.. వెంటనే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమ జీతాలు కత్తిరించడం న్యాయం కాదని కోర్టులో సమగ్రంగా వాదనలు వినిపించారు. దీంతో.. కోర్టు ప్రభుత్వ నిర్ణయ అమలును రెండు నెలల పాటు వాయిదా వేసింది. నిజానికి.. కేరళ ప్రభుత్వం ఉద్యోగులందర్నీ… ఓ నెల జీతం విరాళంగా ఇవ్వమని కోరింది. కానీ ఉద్యోగ సంఘాలు ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాయి. నెలకు ఆరు రోజులు చొప్పున ఐదు నెలలు కత్తిరించుకుంటే… ఆ నెల రోజుల విరాళం వచ్చేస్తుందని..దానికైతే ఉద్యోగులు అభ్యంతరం చెప్పబోరని అనుకున్నారు. కానీ నేరుగా కోర్టుకెళ్లి ఆర్డర్స్ తెచ్చుకున్నారు.
దీంతో కేరళలో జీతం కత్తిరింపులకు అడ్డుకట్ట పడినట్లే. కేరళ ఈ నెల మాత్రమే ఆరు రోజుల జీతం కత్తిరించాలనుకుంది. తెలుగు రాష్ట్రాలు గత నెల నుంచే సగం.. సగం జీతాలు ఇవ్వడం ప్రారంభించాయి. కానీ ఒక్కరంటే.. ఒక్క ఉద్యోగ సంఘం నేత నోరు మెదపలేదు. తమను ఎన్నుకున్న ఉద్యోగుల బాధలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు ఇతర పనుల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతూ.. తమ జీతాలను కత్తిరించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఉద్యోగులు బాధపడుతున్నారు కానీ.. నోరెత్తలేకపోతున్నారు.