కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వంలో అప్పుడే ఒక వికెట్ పడింది. బంధుప్రీతి ఆరోపణలపై పరిశ్రమలు, క్రీడాశాఖ మంత్రి ఇ.పి. జయరాజన్ రాజీనామా చేశారు. ఐదేళ్ల విరామం తర్వాత కేరళలో వామపక్షాలు అధికారంలోకి వచ్చి నాలుగున్నర నెలలైంది. అప్పుడే కొన్ని వివాదాలు ముసిరాయి. ఇప్పుడు అనూహ్యంగా బంధుప్రీతి ఆరోపణ సీఎం విజయన్ సన్నిహిత మంత్రి పదవిని దూరం చేసింది.
పరిశ్రమల మంత్రిగా జయరాజన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన బంధువులు ఇద్దరిని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో నియమించారు. అదేదో ఆషామాషీ పోస్టులో కాకుండా హవా చెలాయించే హోదాను వాళ్లకు కట్టబెట్టారు. దీనిపై దుమారం రేగింది. దీంతో సీపీఎం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
జరిగిన అధికార దుర్వినియోగం కాదనలేనిది. ఆ ఇద్దరూ ఆయన బంధువులే అనేది వాస్తవం. దాన్ని ఎవరూ మార్చలేరు. ఏమార్చలేరు. నిఖార్సయిన నిజాయతీ ప్రభుత్వమని చెప్పుకుంటూ ఇప్పుడీ విషయంలోమంత్రిని సమర్థిస్తే పరువు పోతుందని సీపీఎం నాయకత్వం భావించినట్టుంది. ఆయన్ని సాగనంపాలని నిర్ణయించింది. పైకి మాత్రం ఆయన నైతికతకు కట్టుబడి రాజీనామా చేసినట్టు బిల్డప్ ఇచ్చారు. తాను చేస్తున్నది తప్పని తెలిసీ చేసిన వ్యక్తి నైతిక విలువలకు కట్టుబడ్డారని చెప్తే నమ్మేద్దామా?
ఇదివరకి ప్రభుత్వాల్లా కాకుండా తాము పొరపాటును సరిదిద్దుకున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. నిజమే. అడ్డమైన తప్పులు చేసి అడ్డంగా దబాయించే పార్టీలు చాలానే ఉన్నాయి. అడ్డగోలుగా అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నారు. ఆరోపణలు వచ్చిన మంత్రితో రాజీనామా చేయించడం ఉన్నంతలో కొంత మంచి నిర్ణయమే అన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి.
అయితే జయరాజన్ ఓ వివాదాస్పద మంత్రిగానే సుప్రసిద్ధుడు. ప్రపంచ ప్రసిద్ధ బాక్సర్ మహమ్మదలీ కేరళీయుడే అని ఆయన వ్యాఖ్యానించడంపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత క్రీడాకారిణి అంజు జార్జిని అవమానించారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆమె కేరళ క్రీడా సంఘం అధ్యక్ష పడవికి రాజీనామా చేసింది. ఇలా వివాదాలతో పేరు పొందిన మంత్రి ఈ విధంగా పదవికి దూరమయ్యారు.