వైరస్ కేసులను అత్యంత పకడ్బందీ వ్యూహంతో కట్టడి చేసిన కేరళ సర్కార్.. ఇప్పుడు ప్రజల సాధారణ జన జీవితాన్ని పునరుద్ధరించేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తోంది. కేంద్రం మార్గదర్శకాలతో పాటు.. కొత్త నిర్ణయాలను తీసుకుంది. కేరళను మొత్తం నాలుగు జోన్లుగా విభజించారు. వీటిని రెడ్, ఆరెంజ్-ఏ, ఆరెంజ్-బీ, గ్రీన్ జోన్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనా కేసుల ప్రభావం ఇంకా ఉన్న నాలుగు జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లుగా ఉంచారు. నిత్యవసర వస్తువుల పంపిణీ తప్ప.. ఇక్కడ ఎలాంటి వెసులుబాట్లకు అనుమతి ఉండదు. మూడు జిల్లాల్లో కొన్ని పాజిటివ్ కేసుల చికిత్స కొనసాగుతూండటంతో.. ఆరెంజ్ ఏ జోన్‌గా ప్రకటించారు. అక్కడ 24వ తేదీ నుంచి మినహాయింపులు ప్రకటించారు. ఆరెంజ్ బీ పేరుతో మరికొన్ని నిబంధనలతో మూడు జిల్లాల్లో ప్రజల రోజువారీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లో ఉన్న జిల్లాలో యధావిధిగా కర్యకలాపాలు నడవనున్నాయి.
కొద్ది రోజులుగా కేరళలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో అక్కడ 32 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో 129 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అందుకే ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని విజయన్ ప్రభుత్వం భావిస్తోంది. మినహాయింపులు ఇచ్చిన చోట.. సరి-బేసి విధానంలో వాహనాలకు అనుమతించడంతో పాటు రాత్రి 7 గంటల వరకు రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు అనుమతిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకు పార్సిల్స్ తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. జిల్లాలో తక్కువ దూరంలో ఉన్న ప్రాంతాల మధ్య బస్సు ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే సామాజిక దూరం కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
శని, ఆదివారాల్లో సెలూన్లను తెరిచి ఉంచుతారు. అత్యవసర సేవలు, నిర్మాణ పనులు, వ్యవసాయ సంబంధమైన రంగాలకు అనుమతిస్తారు. అయితే ప్రార్థనా మందిరాలు, సామూహిక వేడుకలు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లపై నిషేధం కొనసాగుతుంది. కేరళ ప్రభుత్వం మొదటి నుంచి వైరస్ విషయంలో ప్రణాళికాబద్దంగ వ్యవహరిస్తోంది. పారదర్శకంగా అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతూ నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా.. ప్రజలు కూడా మద్దతుగా నిలిచారు.