దేశంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైన కేరళ.. పెద్ద రాష్ట్రాల్లో కరోనా ఫ్రీ స్టేట్‌గా మారిన మొదటి రాష్ట్రంగా మారనుంది. ఇప్పటికి గోవా తమ రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు లేవని ప్రకటించుకుంది. అయితే.. పెద్ద రాష్ట్రాల్లో కరోనా ఫ్రీ స్టేజ్‌కి దగ్గర్లో ఒక్క రాష్ట్రం కూడా లేదు. కేరళ మాత్రమే ఆ ఫీట్ సాధించబోతోంది. ప్రస్తుతం కేరళలో 36 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరు కూడా.. వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా కేరళలో కేసులు నమోదు కావడం లేదు. మొత్తంగా కేరళలో 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో నలుగురు మాత్రమే చనిపోయారు. 462 మంది డిశ్చార్జ్ అయ్యారు.
కేరళలో మొదట్లో.. ఇతర రాష్ట్రాలతో పోటీ పడి కేసులు నమోదయ్యాయి. అత్యధిక మంది ప్రవాసులు ఉన్న రాష్ట్రం అయి ఉన్న కేరళకు.. విదేశాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కరోనా వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఉంటుందని అనుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం చాలా పకడ్బందీగా వ్యవహరించింది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. ప్రజలు భౌతిక దూరం పాటించేలా.. వారి అవసరాల్ని ఎప్పటికప్పుడు తీర్చడంతో ప్రజలు కూడా సహకరించారు. దీంతో కరోనా.. కేరళను విడిచిపెట్టి వెళ్లే పరిస్థితి వచ్చింది.
త్వరలో.. పెద్ద ఎత్తున విదేశాల్లో ఉన్న కేరళీయుల్ని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో… నిబంధనలను ఇప్పటికీ కఠినంగానే అమలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలకు కూడా.. కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాలన్నీ.. కేంద్రం అనుమతి ఇచ్చిందంటూ.. పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నాయి. కానీ కేరళ మాత్రం.. కరోనాను చివరి వరకూ ఓడించాలన్న పట్టుదలతో ప్రయత్నిస్తోంది. సాధారణ జన జీవనానికి ఇబ్బంది లేకుండా సడలింపులు ఇచ్చినా నిబంధనలు పక్కాగా పాటించేలా చూస్తున్నారు.