నిత్యావసర వస్తువుల్ని ఇంటికే సరఫరా అయ్యేలా చూస్తాం..! కూలీలు ఎవరూ ఆకలితో ఉండకుండా చేస్తాం..! ఎవరూ గుంపులుగా ఉండాల్సిన అవసరం రాకుండా చేస్తాం..! అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ.. సిన్సియర్‌గా అమలు చేస్తోంది మాత్రం.. ఒక్క కేరళ రాష్ట్రమే. తాజాగా.. గ్రామాల్లో కూడా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి.. భోజనం కావాల్సిన వారికి ఫోన్ చేసిన వెంటనే.. డోల్ డెలివరీ చేసే ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు.. కేరళ సీఎం.. మొదటి నుంచి కరోనాపై పోరులో తన ప్రత్యేకత చూపిస్తున్నారు.
కేరళ అంటే.. ప్రవాసీయుల రాష్ట్రం. ఒక్క గల్ఫ్ కే కాదు.. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కేరళీయులు ఉంటారు.అలాంటి కేరళకు.. సహజంగానే.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే వారికే మొదట ఆ వైరస్ బయటపడింది కాబట్టి… సహజంగానే కేరళలో మొదటి కేసులు వెలుగు చూశాయి. ఇప్పుడు కేరళలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కానీ కేరళ మాత్రం.. దేశం మొత్తం పడుతున్నంత టెన్షన్ పడటం లేదు. వీలైనంత స్మూత్‌గా కరోనాను డీల్ చేస్తోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ.. అత్యధిక మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా నిలిచింది. ఐసోలేషన్ సెంటర్లలో చిన్న ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భోజనం కూడా.. వారిని వీఐపీకి పెట్టినట్లుగా పెడతారు. న్యూస్ పేపర్ కూడా అందిస్తారంటే.. వారి సర్వీస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
లాక్ డౌన్ కారణంగా ప్రజలందరిపైనా ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా రోజుకూలీలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులపై ఎక్కువగా ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ప్రతిపక్షాల నేతలను పిలిచి.. వారితో సంప్రదింపులు జరిపి.. ప్రజలకు ఎలాంటి సాయం చేయాలో.. నిర్ణయం తీసుకుని.. 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. నిత్యావసరాల కోసం ప్రజలు రోడ్లపైకి రాకుండా.. ఇంటి ముంగిటే దొరికేలా చేస్తోంది. దీని వల్ల ప్రజలు బయటకు రాకుండా.. ప్రభుత్వానికి తమ వంతు సాయం అందిస్తున్నారు. అదే సమయంలో.. వర్క్ ఫ్రం హోం చేసుకునేవారి కోసం..మౌలిక సదుపాయాలు పెంచారు. ప్రభుత్వం ఊరకే ప్రకటన చేసి.. అన్నీ ప్రజలే చేయాలంటే.. సాధ్యం కాదు. ప్రభుత్వాల విధులు ప్రభుత్వాలు నిర్వహిస్తే.. ప్రజలూ సహకారం అందిస్తారనేది కేరళను చూస్తే అర్థమైపోతుంది.