లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా. కడియం కావ్య, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, ఆయన కుమార్తె ,జీహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరనున్నారు.
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంతో.. వరంగల్ ఎంపీ టికెట్ ను ఆయన కుమార్తె కావ్యకు ఇచ్చారు కేసీఆర్. దాంతో ఆయన మెత్తబడ్డారని అనుకున్నారు. కడియం కావ్య తరఫున ప్రచారంపై కూడా ఫోకస్ పెట్టారు. ఇంతలోనే బీఆర్ఎస్ తరఫున పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్ కు తాజాగా కావ్య లేఖ రాశారు. కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తోన్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ , లిక్కర్ స్కామ్ వంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో ప్రస్తావించారు. దీంతో ఆమె బీఆర్ఎస్ ను వీడి తండ్రితో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. హుటాహుటిన ఢిల్లీ బయలుదేరిన కడియం శ్రీహరి, కావ్య.. శుక్రవారం కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశమై పార్టీలో చేరనున్నారు. కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. అయితే, కడియం కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరికి అవకాశమిస్తుందో తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ , రాజ్యసభ సభ్యుడు కేకే కూడా పార్టీని వీడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కేసీఆర్ కు ఫామ్ హౌజ్ కు వెళ్లి చెప్పారు. ఈ సందర్బంగా కేకే- కేసీఆర్ మధ్య వాడివేడి సంభాషణ కొనసాగినట్లు తెలుస్తోంది. పార్టీ మీకు చాలా అవకాశాలు ఇచ్చింది.. ఏం తక్కువ చేసిందని బీఆర్ఎస్ ను వీడుతున్నారని కేకే పై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో కేకే మధ్యలోనే ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చారని టాక్ నడుస్తోంది. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరుతున్నారు.
మరో సీనియర్ నేత , మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం బీఆర్ఎస్ ను వీడుతున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్న ఇంద్రకరణ్ రెడ్డికి తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. ఈ నెల 30న కేకేతోపాటు అందరూ ఒకేరోజున కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.