హైదరాబాద్: విద్యా వ్యాపార వస్తువుగా మారి చాలా కాలమయింది. చదువు ‘కొనాల్సిన’ పరిస్థితి ఇప్పుడు సర్వత్రా నెలకొని ఉంది. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలలో వెలుగులోకొచ్చిన పరిణామం విద్యా వ్యాపారానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ‘కేశవరెడ్డి విద్యాసంస్థలు’ పేరుతో విస్తృతంగా కార్పొరేట్ పాఠశాలలు నెలకొల్పిన కేశవరెడ్డి, తమవద్ద చదివే 11 వేలమంది పిల్లల తల్లిదండ్రులనుంచి సుమారు రు.800 కోట్లు డిపాజిట్లు సేకరించి ఇప్పుడు అడుగుతుంటే చేతులెత్తేశారు. అగ్రిగోల్డ్ స్థాయిలో విద్యాసంస్థలలో ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరగటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేశవరెడ్డిని కర్నూలు పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కేశవరెడ్డి పదేళ్ళక్రితం కర్నూలులో తన విద్యా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక చిన్న పాఠశాలతో ప్రారంభించి పది ఎకరాల స్థలంలో రెసిడెన్షియల్ తరహాలో విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయన ఒక కొత్త ఐడియా వేశారు. కాన్సెప్ట్ స్కూల్స్ పేరుతో తరగతినిబట్టి డిపాజిట్ చెల్లిస్తే చదువు పూర్తయిన వెంటనే మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తామని, మధ్యలో స్కూల్ ఫీజులు, హాస్టల్ ఫీజులు ఏమీ కట్టనవసరంలేదని నమ్మబలికారు. ఒక్కొక్క స్టూడెంట్‌కు లక్షనుంచి మూడు లక్షల వరకు వసూలు చేశారు. మొదటి ఐదేళ్ళూ నమ్మకంగా డిపాజిట్లు తిరిగి చెల్లించిన కేశవరెడ్డి, ఆ తరువాత వాయిదా వేస్తూ వస్తున్నారు. డిపాజిట్లు చేసి, పిల్లల చదువులు పూర్తయిన తల్లిదండ్రులు తమ డబ్బు వాపస్ ఇవ్వమంటూ ఏడాదిగా బ్రాంచిలచుట్టూ తిరుగుతున్నారు. ఆరునెలలుగా కేశవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఆయన ప్రతినిధులు, సిబ్బంది తమకేమీ తెలియదని, కరెస్పాండెంట్ తమకేమీ చెప్పలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. కేశవరెడ్డిపై ఆగ్రహం చెందిన బాధితులు నెలరోజులుగా ఆందోళనలకు దిగారు. కేశవరెడ్డి ప్రతినిధులు, సిబ్బందినుంచి స్పందన లేకపోవటంతో ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా పాణ్యంలో గతనెల కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యా ప్రయత్నాలుకూడా చేశారు. అటు బ్యాంకులకుకూడా కేశవరెడ్డి టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాలు చెల్లించలేదని, ఆయన విద్యాసంస్థలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకులు వేలానికి పెట్టాయని బయటపడింది.
మరోవైపు కేశవరెడ్డి వ్యవహారపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అతను తన స్కూల్స్‌ను చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు అప్పగించేందుకు లోపాయకారీ ఒప్పందం కుదిరినట్లు కొంతమంది చెబుతున్నారు. అందుకే కేశవరెడ్డి ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అతను కొద్దికాలం క్రితం తెలుగుదేశం పార్టీ తీర్థంకూడా పుచ్చుకున్నారు. కేశవరెడ్డిని ఇటీవల కొందరు మీడియా ప్రతినిధులు ఫోన్లో సంప్రదించగా, విద్యాసంస్థలలో నష్టం వచ్చిందని, 2016 జూన్ నెలలో అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. గత మార్చినెలలో కేశవరెడ్డి కిడ్నాప్ అయ్యారంటూ మీడియాలో హైడ్రామా నడిచింది. సిబ్బంది పోలీసులకు ఫిర్యాదుకూడా చేశారు. అయితే కాస్సేపటికే ఆయన క్షేమంగానే ఉన్నారంటూ మీడియాకు ఎవరో సమాచారం అంధిచారు. తాజా పరిణామాలనుబట్టి అదికూడా కేశవరెడ్డి ఆడించిన డ్రామా అని అర్థమవుతోంది.