తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
థ్రిల్లర్ సినిమాల లక్ష్యం ఒక్కటే. కథ కొత్తదైనా పాతదైనా – ఆసక్తి కలిగించేలా చెప్పడం. తరువాత ఏం జరుగుతుందో అనే కుతూహలం కలిగించడం. ఇక్కడ కథ ముఖ్యం కాదు. కథనం బాగుండాలి. ట్విస్టులు ఉక్కిరి బిక్కిరి చేయాలి. లేదంటే థ్రిల్లర్ సబ్జెక్ట్‌ని ముట్టుకోవడమే అనవసరం. నిఖిల్ ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఈమధ్య అతని ట్రాక్ రికార్డ్ బాగుంది. పైగా.. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడవ్వడం మరో ప్లస్ పాయింట్. ఇది రివైంజ్ డ్రామా అని ముందే కుండలు బద్దలు కొట్టిన టీమ్… ‘కుడివైపున గుండె ఉన్న వ్యక్తి పగ తీర్చుకొంటే ఎలా ఉంటుంది?’ అంటూ ఆ ఆసక్తికి మరింత బలాన్ని చేకూర్చారు. ఇన్ని లక్షణాలున్నప్పుడు `కేశవ` కచ్చితంగా అందరి దృష్టి తన వైపుకు తిప్పుకోవడం సహజం. మరి… ఆ ఆసక్తిని చివరి వరకూ కేశవ నిలుపుకోగలిగాడా?? కేశవ పగ – ప్రతీకారాలు ఎలా సాగాయి??
కథ :
పోలీస్ శాఖకు చెందిన మాజీ, ప్రస్తుత అధికారులు వరుసగా హత్యకు గురవుతుంటారు. హంతకుడికి సంబంధించి ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకదు. ఈ హత్యలకు కారణం ఏమిటో పోలీస్ శాఖకు అంతుపట్టదు. ఈ కేసు మిస్టరీ ఛేదించడానికి ఓ ప్రత్యేక అధికారిని (ఇషా కొప్పికర్)ని నియమిస్తుంది డిపార్ట్మెంట్. మరోవైపు కేశవ (నిఖిల్) లా చదువుతుంటాడు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. అదే కాలేజీలో కొత్తగా చేరిన తన చిన్నప్పటి స్నేహితురాలు సత్యభామ (రీతూ వర్మ)కి సైతం దూరంగా ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న వరుస హత్యలకూ.. కేశవకు సంబంధం ఉందన్న నిజం పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుస్తుంది. నిజంగానే కేశవనే ఆ హత్యలు చేస్తున్నాడా?? అసలు కేశవకు జరిగిన అన్యాయం ఏమిటి?? పోలీసు శాఖ ఈ కేసుని ఎలా డీల్ చేసింది?? అనేదే కేశవ కథ.
విశ్లేషణ :
హీరోకి గుండె కుడివైపున ఉంది.. అనే పాయింట్‌ని కాసేపు పక్కన పెడితే.. ఇది పరమ రొటీన్ రివైంజ్ డ్రామా! కథా పరంగా కొత్తదనం ఏమైనా ఉందంటే.. హీరోకి ఉన్న లోపమే. దాన్ని కథలో గానీ, సన్నివేశాల్లో గానీ ఎక్కడా బలంగా వాడుకోలేదు. అలాంటప్పుడు హీరోకి గుండె కుడివైపున ఉంటే ఏంటి? అసలు లేకపోతే ఏంటి?? ఓ హత్య.. కామెడీ సీన్లు.. మరో హత్య.. ఇంకొన్ని కామెడీ సీన్లు…. ఇలా సాగింది ప్రధమార్థం. హత్యలు చేయడంలో కొత్తదనం లేదు.. ఆ కామెడీలో అస్సలు లేదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆసక్తి?? హీరో ఎప్పుడూ డల్ గాఉంటాడు. ఏదో కోల్పోయిన వాడిలా చూస్తుంటాడు. `మన్మోహన్ సింగ్ అయినా మాట్లాడతాడు గానీ.. వీడు మాట్లాడడు` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. సరిగ్గా.. హీరో క్యారెక్టరైజేషన్ అలానే ఉంటుంది. ఇంత నీరసం ఆవహించన హీరోని తెలుగు ప్రేక్షకులైతే చూళ్లేరు. జానీ, వన్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే.
పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది థ్రిల్లర్ సినిమాలకు బలం. వాళ్ల లాజిక్కులు, చిక్కుముడిని విప్పడాలూ… ఆసక్తిని కలిగించేలా ఉండాలి. కానీ… కేశవలో అది కూడా పేలవంగా ఉంటుంది. దొరికిన నిందితుడ్ని వదిలేసిన సీన్ దర్శకుడి స్క్రిప్టులోని లోపాన్ని బలంగా ఎత్తిచూపిస్తుంది. అసలు హంతకుడు ఎవరు? అమ్మానాన్నలు ప్రమాదంలో చనిపోవడానికి కారణం ఎవరు? అనేది జనాలకు తెలిసిపోతూనే ఉంటుంది. వీళ్లందరినీ హీరోనే చంపుతాడు అనేదీ తెలుసు. ఇంత రొటీన్ ఫ్లాట్‌ని ఆసక్తికరంగా చెప్పాలంటే.. సీన్లు బలంగా ఉండాలి. కొన్ని ట్విస్టులు అట్టిపెట్టుకోవాలి. సుధీర్ వర్మ ఆ ప్రయత్నమూ చేశాడు. సినిమా కాసేపట్లో ముగుస్తుంది అనగా.. ఓ ట్విస్టు వదిలాడు. అయితే…. దాన్ని తెరపై మరింత పేలవంగా చూపించడంతో.. ట్విస్ట్‌లో ఉన్న కిక్ ప్రేక్షకుడు అనుభవించే అవకాశం లేకుండా పోయింది. ఏ ఇన్వెస్టిగేషన్ అయినా హీరో నుంచి సాగాలి. ఆ పాయింట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. తల్లిదండ్రుల్ని చంపిందెవరో తెలుసుకొనే ప్రయత్నం హీరో చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో.. ఆ యాంగిల్ వైపుకు వెళ్లలేదు దర్శకుడు. స్ట్రిప్టులో లోపాలు… కథని, కథనాన్ని మరింత బలహీన పరిచాయి.
* నటీనటుల ప్రతిభ
కేశవగా నిఖిల్ బాగా చేశాడు. అయితే… ఏం చేశాడు అని ఆలోచిస్తే.. పెద్దగా గుర్తొచ్చే సన్నివేశాలు ఒక్కటీ కనిపించవు. మౌనంగా ఉండడం తప్ప. తనకేదో కొత్త జోనర్ అనో, స్వామి రారా లాంటి హిట్‌తో తన కెరీర్‌ని మార్చిన సుధీర్ వర్మ చెప్పిన కథ అనో.. కనెక్ట్ అయిపోయి ఉంటాడు. రీతూ వర్మ, ఇషా కొప్పికర్ ఇద్దర్నీ హీరోయిన్లు అనలేం. వెన్నెల కిషోర్ క్లాస్ రూమ్ కామెడీ కాస్త క్లాస్ గా సాగింది. పెళ్లి చూపులు స్థాయిలో పంచ్‌లని ఆశిస్తే.. ప్రియదర్శన్ కచ్చితంగా నిరాశ పరుస్తాడు. రావు రమేష్‌ది సర్ప్రైజ్ ప్యాకేజీ.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. మరీ ముఖ్యంగా నేపథ్య సంగీతానికి ఎక్కువ మార్కులు పడతాయి. కెమెరా వర్క్ బ్రిలియెంట్. పతాక సన్నివేశాల్లో పొగలోంచి బైక్నీ, నిఖిల్నీ చూపించిన విధానం.. మెస్మరైజ్ చేస్తుంది. స్క్రిప్టులోని లోపాలే కేశవకి ప్రధాన బలహీనత. ఒక్కసారి రాసింది తిరిగి చదువుకొంటే.. కనిపించే లోపాలు కూడా దర్శకుడికి తట్టకపోవడం విడ్డూరం. టెక్నికల్‌గా సినిమా ఎంత హైలో ఉన్నా అనవసరం… కథలో గ్రిప్పింగ్ సన్నివేశాలు లేకపోతే.. థ్రిల్లర్లు ఇలా చప్పగా తయారవుతాయి.
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
* ఫైనల్ పంచ్ : కేశవ… ఓ రొటీన్ మర్డర్ మిస్టరీ!