విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు లేదని కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ సమాచారం ఇచ్చింది. ఈ నిర్ణయానికి ముందూ వెనుకా ఏం జరిగిందన్న సంగతిని పక్కన పెడితే.. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై చర్చ ప్రారంభమయింది. ఎవరో కాదని కేశినేని సోదరుడు చిన్నీకే టిక్కెట్ ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సభల నిర్వహణ బాధ్యతలు కూడా ఇస్తున్నారు.
కేశినేని శివనాథ్ను అందరూ కేశినేని చిన్నీ అని పిలుస్తారు. తెర వెనుక రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. నాని రెండు సార్లు గెలవడం వెనుక శివనాథ్ పాత్ర కీలకం. అయితే కేశినేని నాని రెండో సారి గెలిచిన తర్వాత సోదరుడ్ని దూరం పెట్టారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కేశినేని నాని ప్రస్తుతం గుడివాడ ఇంచార్జ్ గా ఉన్న వెనిగండ్ల రాము మంచి స్నేహితులు. శివనాథ్ మెల్లగా రాజకీయ. ప్రాబల్యం పెంచుకుంటున్నారని నాని ఆయనను దూరం పెట్టారు. నాని తన కుమార్తె వివాహం చేసినప్పటికి ఆ కార్యక్రమానికి కూడ కేశినేని చిన్నిని ఆహ్వనించలేదు.
రాజకీయంగా ఎదగాలనుకుంటున్న కేశినేని చిన్ని.. మెల్లగా టీడీపీ హైకమాండ్ దగ్గర పరపతి సాధించారు. కేశినేని వ్యవహారాశైలితో వేగడం కష్టమని భావించిన నారా లోకేష్ ఆయనకు ప్రాధాన్యతనిచ్చారు. మెల్లగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆయన ప్రభావాన్ని పెంచుకుంటూ పోయారు. చివరికి ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినట్లుగా మీడియాలో వచ్చేలా చూశారు. ఆ తర్వాత బహిరంగసభల బాధ్యతలు కూడా ఇచ్చారు. దీంతో ఆయనకే టిక్కెట్ అని తేలిపోయింది.