బెజవాడ ఎంపీ కేశినేని నాని ఎంపీ పదవికి, టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి అనంతరం తెలుగు దేశం పార్టీ నుండి కూడా బయటకు వస్తానని ప్రకటచించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినప్పటి నుండీ పార్టీ పై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బయట పెట్టిన కేశినేని నాని ది ఎప్పుడూ ముక్కుసూటి వ్యవహారమే. అయితే గత కొన్ని రోజులుగా ఆయన కు విజయవాడ ఎంపీ సీటు మరోసారి దక్కదు అనే ప్రచారం ఊపందుకుంది. దానికి తగ్గట్టు గానే టీడీపీ లో నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని కి ప్రాధాన్యత లభించడాన్ని నాని పలు సందర్భాల్లో విమర్శిస్తూ నే వచ్చారు.
తిరువూరు లో చంద్రబాబు బహిరంగ సభ జరుపనున్నారు. దానికి సంబంధించిన సన్నాహక సదస్సులో కేశినేని నాని ఫోటో లేకపోవడం తో నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య కొట్లాట జరిగింది.దీనిలో బందోబస్తుకు వెళ్ళిన పోలీసులకు కూడా దెబ్బలు తగిలాయి. వెంటనే రంగం లోకి దిగిన చంద్రబాబు తన రాయబారులు గా కొనికళ్ళ నారాయణ లాంటి కీలక నేతల్ని నాని వద్దకు పంపించి తిరువూరు సభకు దూరంగా ఉండమని చెప్పినట్టు నాని తెలిపారు. అలాగే విజయవాడ ఎంపీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వరని చెప్పినట్టు కూడా ప్రకటించారు .
ఇదే విషయమై నిన్న మాట్లాడుతూ పార్టీ అద్యక్షడి నిర్ణయానికి తాను విధేయుడు గా ఉంటానని అన్నారు. అయితే ఒకరోజు గడిచే లోపులోనే తాను పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. దీనితో నాని వ్యూహం ఏంటి…ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు పడబోతున్నాయి అనేదానిపై చర్చ జరుగుతోంది. పార్టీ మహానాడుల్లో కూడా పాల్గొనని.. పార్టీ ఆఫీసుపై దాడి చేస్తే కనీసం స్పందించని నానికి బుజ్జగించి పార్టీలో ఉంచుకోవాల్సిన అవసరం లేదని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది.