కేశినేని కుటుంబంలో రాజకీయ చిచ్చు తగ్గేలా కనిపించడం లేదు. కేశినేని నాని ఎంపీ టిక్కెట్‌కు ఆయన సోదరుడు చిన్ని ఎసరు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలోని కొన్ని వర్గాలు ఆయనకు మద్దతుగా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే చిన్నీ ఎప్పుడూ లేని విధంగా పర్యటనలు చేస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ వంటి వారితోనూ భేటీలు జరిపి తన రాజకీయ జీవితంపై చర్చిస్తున్నారు. నానితో విభేదాల కారణం ఇప్పుడు మాటల్లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఆయన గెలుపు కోసం పని చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు.
కేశినేని నాని తరచూ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు ఇలా విరమించుకోవడం అనేది కష్టం. అయితే రెండు సార్లు గెలిచిన కేశినేని నాని తన కుమార్తె ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నారు. ఇందు కోసం చంద్రబాబు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతోనే ఆయన అలిగినట్లుగా చెబుతున్నారు. ఆయన చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే అది నిజమో కాదో తెలియదు. కానీ కేశినేని కుటుంబంలో శుభకార్యానికి చంద్రబాబు, లోకేష్ .. కుటుంబసమేతంగా వెళ్లారు.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానంలో కేశినేని నానికి బదులుగా మరో వ్యక్తిని పోటీకి నిలపడం ఖాయమే. అప్పటికి నాని తానే బరిలో ఉంటానని ఆసక్తి చూపించినా చంద్రబాబు అంగీకరించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కేశినేని నాని గతంలో చాలా ఇబ్బందికరమైన ప్రకటనలు చేశారు. తన బలంతోనే గెలిచాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరి మాటా వినకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్లి దెబ్బతిన్నారు. తన బలంతోనే గెలిపించుకుంటాన్నారు. ఆయన తప్పుకోకపోయినా ఈ సారి అభ్యర్థి మార్పు ఖాయమని.. అందుకే ఆయన సోదరుడు అదృష్టం పరీక్షించుకుంటున్నారని అంటున్నారు.