డేటా సెంటర్లు పెడతామని వచ్చిన ఉర్సా క్లస్టర్ కంపెనీకి దాదాపుగా అరవై ఎకరాలను కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడం వివాదాస్పదమయింది. ఈ కంపెనీని సిపారసు చేసింది.. ప్రభుత్వం వద్దకు చేర్చింది విజయవాడ ఎంపీ అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఉర్సా క్లస్టర్ డైరక్టర్లలో ఒకరు కేశినేని శివనాథ్ క్లాస్ మేట్ గా చెబుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అనుభవం, నిధులు .. కార్యకలాపాలు లేని కంపెనీని ప్రభుత్వానికి సిఫారసు చేసి భూములు కేటాయించేలా చేసుకున్న విజయవాడ ఎంపీపై టీడీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎలాంటి కంపెనీకి భూకేటాయింపులు చేసినా వెంటనే వెలుగులోకి !
ప్రభుత్వం ఎకరం భూకేటాయింపులు చేసినా ఆ కంపెనీ పూర్వాపరాలు మొత్తం ఆరా తీయడానికి విపక్షాలే కాదు మీడియా కూడా రెడీగా ఉంటాయి. ఉండాలి కూడా. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు ఎకరా99 పైసలకు కేటాయించినా ఎక్కడా వ్యతిరేకత రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఇస్తుందని దాని వల్ల మరిన్ని పరిశ్రమలు వస్తాయని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఉర్సా క్లస్టర్ కంపెనీకి భూములు కేటాయించినా ఆ కంపెనీపై పరిశీలన ఉంటుంది. కానీ విజయవాడ ఎంపీ మీద నమ్మకంతో ప్రభుత్వం కేబినెట్ లో భూకేటాయింపులు చేసింది. ఆయన తన నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారు.
ఉర్సా క్లస్టర్ భూకేటాయింపు జీవో ఇక బయటకు రాదు !
ఇంత వివాదం చెలరేగిన తర్వాత ఉర్సా క్లస్టర్ కు భూకేటాయింపుల వ్యవహారం ముందుకు సాగే అవకాశం లేదు. కేబినెట్ నిర్ణయం అనేది ప్రాథమికమైన ఆమోదం. ముందు ముందు చాలా ప్రక్రియలు దాటి భూకేటాయింపు ఉంటుంది. ఇప్పుడు కేబినెట్ నిర్ణయంతోనే ఉర్సా క్లస్టర్ గురించి బయటకు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక ఎలాంటి చర్యలు తీసుకోక పోవచ్చని.. రద్దు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ వైసీపీ హయాంలో కంపెనీలకు భూములు కట్టబెట్టేవారు. కానీ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేసే అవకాశం లేదు. భూములు కేటాయించే జీవో ఇక విడుదల కాకపోవచ్చు.
ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం
ప్రభుత్వం తమ పార్టీ ప్రజాప్రతినిధులు అయినా పెట్టుబడులు తీసుకు వస్తామని చెప్పినా సరే మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఉర్సా క్లస్టర్ చెబుతోంది. కొత్త కంపెనీ అయినా.. ఆ కంపెనీ ప్రమోటర్లకు ఆర్థిక పరిస్థితి బాగుంటే నమ్మకం కలిగేలా ఉంటుంది కానీ… అసలు వ్యాపార అనుభవమే లేని వారు.. ఇలాంటి కంపెనీలతో వస్తే మాత్రం ప్రభుత్వాలు జాగ్రత్త పడాల్సిందే.