విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ప్రజలు తనను నెత్తి మీద పెట్టుకుంటారని..గొప్పలు పోతున్నారు. టీడీపీ టిక్కెట్ ఇచ్చినా లేకపోయినా డోంట్ కేర్ అంటున్నారు. అలా అంటూ వైసీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు.
చంద్రబాబు టిక్కెట్ల కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. పోటీ ఉన్న చోట ప్రాబబుల్స్ ను రెడీ చేసుకుని వారితో మాట్లాడారు. కేశినేనిని మాత్రం పిలిచి మాట్లాడలేదు. అంటే అసలు ప్రాబబుల్స్ జాబితాలో కూడా పెట్టలేదన్నమాట. దీంతో ఈ సారి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వరని క్లారిటీ వచ్చేసింది. అందుకే విజయవాడ ఎంపీగా ఏ పిట్టల దొరకు తెలుగుదేశం పార్టీ తరపున టిక్కెట్టు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదని చెప్పుకొస్తున్నారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అ.. తన మాటలను పార్టీ ఎలా తీసుకన్నా తనకు భయం లేదన్నారు.
తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని కేశినేని నాని చెప్పారు. తాను చేసిననన్ని పనులు దేశంలో ఏ ఎంపీ కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు.ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమోనని చెప్పుకొచ్చారు. నాని అసలు రాజకీయాల్లో ఉండనని కొన్ని సార్లు.. ఎంపీగా పోటీ చేయనని కొన్ని సార్లు లీకులు ఇచ్చారు. ఇప్పుడు పోటీ చేస్తానంటున్నారు కానీ..టీడీపీ మాత్రం ఆయనను దగ్గర తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన కుమార్తెకు కూడా సీటిచ్చే అవకాశాలు లేవంటన్నారు.
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నానికి ఇతర నేతలకు మధ్య ఉన్న విబేధాలు మరింత బహిర్గతమయ్యాయి. తన కుమార్తెను మేయర్ అభ్యర్థిగా ఏకపక్షంగా ప్రకటించుకుని.. తానే గెలిపించుకుంటానని ప్రచారం చేశారు. అయితే ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయినా కేశినేని ..తన ఇమేజ్ ఆకాశంలోనే ఉందని అనుకుంటున్నారు.