కేశినేని నాని.. ఈపేరు ట్రాన్స్పోర్ట్ రంగంలో పరిచయం అక్కరలేని పేరు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడంలో ఆర్టీసీ తరవాత అంతటి పేరు దాని సొంతం. ఈ రంగంలో ఇక దాని పేరు కనిపించదు. కేశినేని ట్రావెల్స్‌ను మూసివేయాలని దాని యజమానీ, విజయవాడ ఎంపీ అయిన నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తమ సంస్థ సరకు రవాణాకే పరిమితమవుతుందని స్పష్టంచేశారు. అహం దెబ్బ తింటే ఇలాంటి నిర్ణయాలే వెలువడతాయని చెప్పడానికి నాని ఒక ప్రబల ఉదాహరణ. ఆరెంజ్ ట్రావెల్స్ వివాదంలో ఏపీ రవాణా శాఖ కమిషనర్‌పై దౌర్జన్యానికి దిగారని ఆరోపణలు రావడం, ఈ అంశం మీడియాలోనూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తానని ఎప్పుడూ జబ్బలు చరుచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ప్రతిష్ట ఎక్కడ దెబ్బతింటుందోననే భయంతో దీనికి కారణమైన కేశినేని, విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కమిషనర్‌కు క్షమాపణ చెప్పించారు.
ఆస్తిపాస్తులలోనూ.. ప్రతిష్టలోనూ చంద్రబాబుతో సరితూగే స్టేచర్ ఉన్న కేశినేని అహాన్ని ఇది దెబ్బతీసింది. విజయవాడ ఎంపీ టికెట్ పొందడానికి సైతం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అంతకంటే పోరాడాల్సి వచ్చిందనడం భావ్యం. తప్పని సరి పరిస్థితులలోనే చంద్రబాబు కూడా కేశినేని టికెట్ ఇవ్వాల్సి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాజకీయ నాయకుల్లో రెండు రకాలుంటారు. పదవులకోసం పాకులాడే వారు కొందరైతే… దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలని చూసే వారు కొందరు. కేశినేని మూడో రకానికి చెందిన వ్యక్తి. ఆయనకు పదవులకోసం కానీ, సంపాదన కోసం కానీ పాకులాడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులే డబ్బు కావాలని దేబిరించారు తప్ప ఆయనెప్పుడూ తనకిది కావాలనుకోలేదు. ఎంపీ పదవి ఆపదలో ఆదుకుంటుందనుకున్నారు. జాతీయ స్థాయిలో రవాణ రంగంలో పేరొస్తుందని నాని భావించారు. సమాజంలో ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషిస్తున్న ఎవరికైనా ఒకరి ముందు తలొంచడాన్ని మించిన తలొంపులుండవు. అలాగని నాని లాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఇది సహజమని సద్దుకుపోయే తత్వమూ లేదు. ఎప్పుడూ తనచేయి పైన ఉండాలని కోరుకుంటారాయన.
ప్రత్యర్థి ట్రావెల్స్ సంస్థతో వివాదం అంశంలో ఆయనను తలొంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడం ఆయనకు తల కొట్టేసినట్లయ్యింది. ఇప్పటిదాకా రవాణా రంగంలో తనకంటూ పేరును తెచ్చుకున్న నాని దీన్ని సహించలేకపోయారు. అందుకే ఆ రంగంనుంచే తప్పుకోవాలని భావించారు. ఇలాంటి నిర్ణయంతో ఆయన్ను ఓ హీరోగా పేర్కొంటూ కొందరు అప్పుడే భజన మొదలెట్టేశారు. కేశినేని నాని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ఆయన వ్యక్తిగతమూ, వృత్తిగతమూనూ. దానితో మనకెలాంటి సంబంధమూ లేదు. సంబంధంలేని అంశంలో వేలుపెట్టి రవాణా శాఖ కమిషనర్‌పైనే దౌర్జన్యానికి దిగినప్పుడు కేశినేనికి ప్రతిష్ట గుర్తొచ్చుంటే బాగుండేది. పరువు ఎవరికైనా ఒకటే. నీకైతే తక్కువ ప్రత్యర్థికైతే తక్కువా కాదు. క్షమాపణ చెప్పాల్సి వచ్చినందుకే వ్యాపారం మానేయాలని నిర్ణయించుకోవడం నానికే చెల్లింది. ఈ ఉదంతంలో తలకొట్టేసినట్లయిన కమిషనర్ ఏం చేయాలి. ఉద్యోగం మానేయలేడు. వేరొకచోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం తప్ప. ఎక్కడికెళ్ళినా గతం వెంటాడుతూనే ఉంటుందాయన్ను.
రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు ఎవరినీ నొప్పించనవిగా ఉండాలి. అలా చేసినప్పుడే అంతా సవ్యంగా ఉంటుంది. ఆదినుంచి ప్రతిపక్షానికి ఒక రూలు.. అధికారపక్షానికి ఒక రూలును పాటిస్తున్న చంద్రబాబుకు నాని ఉదంతం వచ్చే ఎన్నికల్లో విజయవాడలో సవాలుగానే మారుతుంది. నాని తన నిర్ణయంతో అధికార పక్షానికి జరగనున్నదేమిటో అన్యాపదేశంగా తెలియజెప్పారు.
Subrahmanyam vs Kuchimanchi