బీజేపీలో చేరబోతున్నారని అందుకే అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ కేశినేని నాని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని గతంలో చేసిన ప్రకటనలో ఇప్పటికీ మార్పు లేదని.. దానికే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. అదే సమయంలో ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలే అవసరం లేదని తాను నమ్ముతానన్నారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని.. వారి కోసం తన ప్రజా సేవ కొనసాగుతుందన్నారు.
కుల, మత , రాజకీయాలకు భిన్నంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు తన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. దీనికి రాజకీయంతో.. రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదన్నారు. ప్రస్తుతం మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా బేస్ లెస్ అని వాటిని నమ్మవద్దని కోరారు. తనకు సాధ్యమైనంతగా విజయవాడ అభివృద్ధికి ప్రయత్నం చేయడమే తన భవిష్యత్ కార్యాచరణ అని స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. తన కమిటీ మెంట్ ను ఇలాగే కొనసాగిస్తానని తెలిపారు.
కేశినేని నాని ఇప్పటికైతే ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని చెప్పారు. కానీ ప్రజాసేవ పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. రేపటి రోజున ప్రజలంతా తనను మళ్లీ రాజకీయంగా యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన ఏదో ఓ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందు కోసమే ఆయన ఈ తరహా గ్రౌండ్ ప్రిపరేషన్ అని సులువుగాే అర్థం చేసుకోవచ్చు.