తనను కాదని, తన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారని నారా లోకేష్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీని వీడిన కేశినేని నాని నారా లోకేష్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపుల వ్యవహారంలో కేశినేని చిన్నిపై ఆరోపణలు చేస్తూ నారా లోకేష్ కు విజ్ఞప్తులు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
ఉర్సా క్లస్టర్స్ కు భూమి కేటాయింపులపై వివాదం జరుగుతోంది . ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు తాజాగా లేఖ రాసిన నాని.. అందులో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూ కేటాయింపును వెంటనే రద్దు చేయాలని కోరారు. కంపెనీ యాజమాన్యం, నిధుల మూలం, రాజకీయ సంబంధాలపై వివరణాత్మక విచారణకు ఆదేశించాలవిజ్ఞప్తి చేశారు. అవినీతి ప్రయోజనాల కోసం పార్టీ నాయకత్వాన్ని , పార్టీ పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అంతేకాకుండా నారా లోకేష్ పేరును కేశినేని చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు కేశినేని నాని. ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపులపై సీఎంకు రాసిన లేఖలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరడంతోపాటు, లోకేష్ ప్రతిష్ఠ మసకబారేలా చిన్ని వ్యవహరిస్తున్నారు అని అభిమానం చూపడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల చంద్రబాబు జన్మదినం సందర్భంగా.. ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు కేశినేని నాని. ఆయనతో కలిసి పని చేయడాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పిన ఆయన.. ఇంతలోనే తన సోదరుడిపై ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖలో లోకేష్ పై అభిమానం కనబరచడం ఆసక్తికరంగా మారింది. ఆయన తన కూతురి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.