టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటా వంటి ప్రకటనలు చేసిన కేశినేని తాజాగా మరో ప్రకటన చేశారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెడతానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాని పిలుపునిచ్చారు.
తనకు పార్లమెంట్ టిక్కెట్ ప్రకటించుకోవడమే కాకుండా… తనతో పాటు బేగ్ అనే నేతకూ టిక్కెట్ ప్రకటించేసుకున్నారు కేశినేని నాని. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన లోకేష్ పాదయాత్ర వైపు కనీసం కేశినేని నాని చూడలేదు. పార్టీకి కష్టమైనప్పుడు కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా టిక్కెట్ల ప్రకటనలు చేసుకోవడం ఉద్దేశపూర్వకమేనని చర్చ జరుగుతోంది. బెజవాడలో పాదయాత్ర సక్సెస్ కు కారణం తానేనని పరోక్షంగా చెప్పుకుంటున్నారు కూడా. తాను వెళ్లకపోయినా పాదయాత్రలో బేగ్ తో పాటు మరికొంత మంది తన అనుచరులే సక్సెస్ చేశారని ఇంకెవరూ పార్టీ కోసం పని చేయలేదని స్పష్టం చేశారు.
టీడీపీ హైకమాండ్ నానికి ప్రాధాన్యం ఇస్తోంది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా వెంటబెట్టుకు వెళ్తున్నారు. కానీ పార్టీ పరమైన కార్యక్రమాల్లో మాత్రం కనిపించడం లేదు. ఆయనకు ఈ సారి టిక్కెట్ లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో తన నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులను కూడా రెబల్స్ ను నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని అందులో భాగంగానే… బేగ్ లాంటి వారిని నియోజకవర్గానికి ఒకరిని ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.