కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను చంద్రబాబుకు కూడా వెల్లడించారని చెప్పుకొచ్చారు. అయితే ఆయన తన కుమార్తెను రాజకీయాల్లో ప్రోత్సహించాలనుకుంటున్నారని ఆమె కోసం ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపించింది. అయితే దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె కూడా ఇక రాజకీయాల్లో ఉండదని స్పష్టం చేశారట.
కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్థిగా కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆమె కార్పొరేటర్‌గా గెలిచినా టీడీపీ మాత్రం ఓడిపోయింది. ఆ తర్వతా శ్వేత కూడా కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. ఆమె గతంలో టాటా ట్రస్ట్‌లో కీలకంగా పని చేసేవారు. మళ్లీ టాటా ట్రస్ట్‌లోనే పనిచేసేందుకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆమె కూడా పోటీ చేయదని చెబుతున్నారు. టాటా ట్రస్ట్ ఆమె ద్వారానే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టింది.
కేశినేని నాని ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నేతగా పేరు ఉంది. ఆయనకు ఇటీవలి కాలంలో బెజవాడ టీడీపీ నేతలతో సరిపడటం లేదు. వర్గపోరాటం ఎక్కువ అయింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కూడా ఇది బయటపడింది. అయితే అప్పట్లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాట్లాడి పరిస్థితుల్ని సర్దుబాటు చేశారు. ఈ కారణంగా పార్టీలో ప్రాధాన్యం కోసం ఇలా చేస్తున్నారా లేకపోతే నిజంగానే పోటీ రాజకీయాల నుంచి వైదొలుగుతారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.