వైసీపీలో ఎప్పుడు ఎవరి మీద పిడుగుపడుతుందో చెప్పలేం. విజయవాడ ఎంపీ సమన్వయకర్తగా ఇంకా పార్టీలో కూడా చేరకుండానే నియమితులైన కేశినేని నాని మీద ఎక్కువ ఆలస్యం కాకుండానే పిడిగు పడిందన్న ప్రచారం జరుగుతోంది. మైలవరం నియోజకవర్గాన్ని చూసుకోవాలని వైసీపీ హైకమాండ్ తాజాగా ఆదేశించింది. దానికి కారణం వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి దూరం జరుగుతున్నారు. ఏలూరులో నిర్వహించే సిద్ధం సభకు నియోజకవర్గం నుంచి జన సమీకరణ చేయాల్సి ఉన్నా.. తాను చేయను..సభకు రానని చెప్పేశారు.
ఆయన పార్టీ మారడం ఖాయమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. మధ్యలో ఆయనను జగ్గయ్యపేటకు వెళ్లమని సూచించారు. దీంతో అలిగి ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. నాలుగైదు సార్లు సీఎంవో పిలిచినా రాలేదు. తరవాత మైలవరం టిక్కెట్టే ఇస్తామని చెప్పడంతో వచ్చారు. అయితే ఆయన నియోజకవర్గంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున బిల్లులు రావాల్సి ఉందని వాటిని కోసమే మళ్లీ ఆయన వచ్చారని అనుకుంటున్నారు. అవి వచ్చాయో రాలేదో కానీ.. ఆయన మళ్లీ పార్టీకి దూరమయ్యారు. వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐదో తేదీ తర్వాత ఆయన తన కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఈ విషయాన్ని కనిపెట్టిన వైసీపీ కేశినేని నానిని మైలవరం గురించి చూడాలని సలహా ఇచ్చారు. ఆయన కూడా వెంటనే రంగంలోకి దిగిపోయి… .వైసీపీ క్యాడర్ తో సమావేశమయ్యారు. మైలవరంలో రెండు వర్గాలున్నాయి. ఒకటి వసంతది.. మరొకటి జోగి రమేష్ ది. జోగిని పెనుమలూరుకు ఇంచార్జుగా నియమించారు. ఇప్పుడు కేశినేనికి ఎంపీ టిక్కెట్ ఎగ్గొట్టి.. మైలవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఊపందుకుంటోంది. అదే జరిగితే నాని ముఖచిత్రం ఏమిటని… టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నాయి.