విజయవాడ లోక్ సభ నియోజకవర్గం ఇప్పుడు హాట్ సీట్ గా మారింది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున కేశినేని నాని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సుమారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన పై వైసీపీ తరపు నుంచి పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ పరాజయం పాలయ్యారు. ఆయన ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచీ బెజవాడ నియోజకవర్గాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. సిట్టిగ్ ఎంపీ నాని.. పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు సాధించడంతో… నానిపై పోటీ చేసే అభ్యర్ధి కోసం వైసీపీ పెద్ద కసరత్తే ప్రారంభించింది. చాలా మంది పారిశ్రామికవేత్తల్ని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి 20 ఏళ్ల కిందట పోటీ చేసి ఓడిపోయిన దాసరి జై రమేష్‌ను సంప్రదించారు. ఆయన అంగీకరించారు.
జైరమేష్ పారిశ్రామిక వేత్త కూడా కావడం, గన్నవరం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జైరమేష్ ను విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని భావించారు. కానీ పార్టీలో చేరిన తర్వాత పీకే టీం చేసిన సర్వేలో… సానుకూల భావన రాలేదన్న కారణంగా… కొత్తగా పొట్లూరి వరప్రసాద్ తెరపైకి వచ్చారు. గత ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఉండటంతో జనసేన తరపు నుంచి పొత్తులో భాగంగా పొట్లూరి వరప్రసాద్ విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ప్రయత్నించారు. అప్పటికే కేశినేని నాని పేరు ఖరారు కావడంతో చంద్రబాబు వరప్రసాద్ పోటీకి ససేమీరా అన్నారు. ఇప్పుడు అవకాశం లభించింది.
దాసరి జై రమేష్ సోదరులు వైసీపీలో చేరడంతో వారికి ఎటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తారనేది వైసీపీలో ఆసక్తికరంగా మారింది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం అభ్యర్ది కేశినేని నాని, అసెంబ్లీ అభ్యర్దులు తిరువూరు మినహా, మిగతా ఆరు నియోజకవర్గాలలో అందరూ ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ తరపు నుంచి మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, యలమంచిలి రవి, కూడా ప్రచారాన్ని ప్రారంభించారు ఇప్పుడు వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్దిపై ఇంకా మీమాంస నెలకొనడం ఆపార్టీ వర్గాలను ఇబ్బంది పెడుతోంది. త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే బాగుండని.. లేకపోతే.. మరో కొత్త పేరు తెరపైకి వస్తుందని.. ఆందోళన చెందుతున్నారు.