విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సొంత గూటికి చేరాలనుకుంటున్నారా? రాజకీయాల నుంచి వైదొలిగినట్లు ప్రకటించిన నాని, కూతురి భవిష్యత్ కోసం మళ్లీ పొలిటికల్ పట్టాలు ఎక్కాలని డిసైడ్ అయ్యారా? ఈమేరకు ఆయన సంకేతాలు పంపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
కేశినేని నాని తాజాగా చేసిన ఫేస్ బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి,బెజవాడ నుంచి పోటీ చేసి తమ్ముడు చేతిలోనే ఓటమి పాలయ్యారు. వైసీపీ అధికారం కూడా కోల్పోవడంతో నాని ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కానీ, కొంతకాలంగా రాజకీయాల్లో ఆయన మళ్లీ యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పుట్టిన రోజున తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది.
75వ వసంతంలోకి అడుగుపెడుతున్న చంద్రబాబు ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవకు సూచిస్తుందని నాని పేర్కొన్నారు. ఆయనతో ఈ ప్రయాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో సేవలో మరిన్ని ఏళ్లు చురుగ్గా ఉండాలని కోరుకుంటున్నట్లు పోస్టులో రాశారు నాని.
ప్రస్తుతం తన కూతురు శ్వేత రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు నాని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, ఆయన వస్తానంటే నాని సోదరుడు చిన్ని తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ విషయం నానికి కూడా తెలుసు. అయినప్పటికీ కూటమి పార్టీలో చేరాలంటే చంద్రబాబు సమ్మత్తి కూడా కీలకం. టీడీపీలో చేరేందుకు అడ్డంకులు ఏర్పడినా.. బీజేపీలో అయినా చేరే దిశగా నాని ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది.