విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి… మూసేసిన వ్యాపార సంస్థ కేశినేని ట్రావెల్స్ వ్యవహారాల్లో చిక్కులు తప్పడం లేదు. విజయవాడలో కేశినేని భవన్ ముందు ట్రావెల్స్ మాజీ ఉద్యోగుల ధర్నా చేశారు. మూడేళ్లుగా జీతాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. సంస్థను మూసేసి డబ్బులు చెల్లించకుండా బయటకు పంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేశినేని ట్రావెల్స్ మాజీ ఉద్యోగుల ధర్నాకు ఇతర రాజకీయ పార్టీల నేతలూ సంఘిభావం తెలిపారు. మాజీ ఉద్యోగుల ధర్నాపై ఎంపీ నాని స్పందించారు. కేశినేని ట్రావెల్స్‌లో పనిచేసిన ఎవరికీ బకాయి పడలేదని ప్రకటించారు. బకాయిలు ఉన్నాయంటూ… గుంటూరు లేబర్ కోర్టులో 14మంది మాత్రమే కేసు పెట్టారని.. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నిజంగా బకాయిపడ్డట్టు ఆధారాలు చూపితే సెటిల్ చేస్తానని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వందలాది మందికి జీతాలు ఇవ్వలేదని ట్వీట్లు చేస్తున్నవారు… వందల మంది కార్మికులు ఎవరో చూపించాలని సవాల్ చేశారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. కేశినేని నాని ట్రావెల్స్ బస్సులను నడిపేవారు. అయితే.. ఓ వివాదంలో అప్పటి రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత తనకు కేశినేని ట్రావెల్స్ వల్ల లాభం రావడం లేదని చెప్పి..సంస్థను మూసివేశారు. అయితే.. కేశినేని కార్గో బిజినెస్ ను మాత్రం కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. అప్పట్లోనే ఆయన కొంత మందికి జీతాలు ఎగ్గొట్టారని ప్రచారం జరిగింది. కేశినేని రాజకీయ నేత కావడంతో.. సహజంగానే ఎక్కువ ప్రచారం జరిగింది. పధ్నాలుగు మంది మాత్రం.. గుంటూరు లేబర్ కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరుగుతోంది. తాను ఎవరికీ ఒక్క రూపాయి బాకీ పడలేదని.. అందరికీ సెటిల్ చేశానని కేశినేని అప్పట్నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆయన సొంత పార్టీతో పాటు.. ప్రతిపక్ష పార్టీలపై ట్వీట్ల ద్వారా చేస్తున్న విమర్శలు హైలెట్ అవుతూండటంతో.. ఆయనకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ నేత పీవీపీ కూడా.. ట్వీట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయనే.. మళ్లీ.. ఈ కార్మికుల వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
వందల మందికి.. కేశినేని నాని.. జీతాలు ఎగ్గొట్టారని.. పీవీపీ ట్వీట్లో ఆరోపించారు. అప్పడే.. వాళ్లెవరో తీసుకొస్తే సెటిల్ చేస్తానని కేశినేని ప్రకటించారు. ఇప్పుడు అనూహ్యంగా తాము మాజీ ఉద్యోగులమంటూ… వందల మంది… కేశినేని కార్యాలయం ముందు ధర్నాకు దిగడం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. మొత్తానికి కేశినేని చేసిన ట్వీట్ రాజకీయంతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. కేశినేని ఎంత బలంగా వివరణ ఇచ్చినప్పటికీ.. ఈ విమర్శలు ఇలా కొనసాగుతూనే ఉంటాయన్నది అసలు రాజకీయం.