కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదంలో.. ఒక మంచి వ్యక్తిగా, ఆత్మీయ వ్యక్తిగా ప్రజల గుండెల్లో ఉన్న చిరంజీవిగారు జోక్యం చేసుకొని ఈ వివాదంకు తెరదించాలని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చిరంజీవిని అర్ధించారు.
ఆయన ఒక ప్రకటనలో – “గతంలో మీ పట్ల సినీ నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మీ అభిమానులు ఆయనపై దాడి చేయగా, మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించి, ఒక మంచి సంస్కృతికి నిదర్శనమై.. ఆ వివాదంను మీరు పరిష్కరించారు. కానీ పవన్ కల్యాణ్ ఆయనకున్న గుణగణాలను బట్టి ఆయన ఎవరికీ తలవంచే వ్యక్తి కాదు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు జరుగుతున్న కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల గొడవల కారణంగా ప్రజలలో మీ కుటుంబంపట్ల ఉన్న గౌరవం సన్నగిల్లుతుంది. మిమ్మల్ని అభిమానించే మా అందరినీ ఈ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తుంది. బయట మీ కుటుంబం అంటే గిట్టనివారు ఈ వివాదంను పెంచి పోషించుచూ నవ్వుకుంటున్నారు. ఇందులో మూడవ వారి పాత్ర ప్రమేయం ఎక్కువయింది. కత్తి మహేష్ విషయంను గోరుతో పోయే దానిని గొడ్డలి వరకు తీసుకురావటం, మీ కుటుంబంను అభిమానించే అందరికీ చాలా బాధని కలిగిస్తుంది. ఎవరి మధ్యో జరుగుతున్న దానికి మనం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి.. అని అనుకుంటే పోయేది మన పరువే.. కాబట్టి మీరు వెంటనే సహృదయభావంతో ఈ విషయం గురించి ఆలోచించి, కత్తి మహేష్‌ని పిలిచి, మాట్లాడి ప్రజలలో మీ పట్ల గౌరవంని ప్రదర్శించి.. ఈ సంక్రాంతితో ఈ వ్యవహారానికి ముగింపు పలికి.. చిరంజీవి.. చిరంజీవిగా మా గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం.”
అయితే, ఈ ఇష్యూ ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలన్న కేతిరెడ్డి వాదన సమంజసంగానే కనిపిస్తున్నప్పటికీ, ఇందులో కొన్ని లొసుగులున్నాయి. ఉదాహరణకి, పవన్ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పినా, చిరంజీవి వచ్చి సారీ చెప్పిన కత్తి మహేష్ వివాదం పరిషృతం అవుతుందనుకోవడం అవివేకం. చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పినా ఆ తర్వాత చిరంజీవి మీద రాజశేఖర్ దంపతుల దాడి దాదాపు మరో మూడున్నరేళ్ళు కొనసాగింది. ఆ తర్వాత – రాజశేఖర్ వెనకాల ఉండీ ఎగద్రోసిన వాళ్ళు చిరంజీవి తో ప్యాచప్ అయిపోయి, రాజశేఖర్ ని గాలికి వదిలేసాక, రాజశేఖర్ కి మర్మం అర్థమై అనవసరంగా ఈ గొడవల్లో తన సినీ భవిష్యత్తు ని పణంగా పెట్టానని గుర్తించి, పలు ఇంటర్వ్యూల్లో చిరంజీవి తో ప్యాచప్ అయ్యే సూచనలు ఇచ్చి, చిరంజీవి ని వ్యక్తిగతంగా కలిసి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. స్వతహాగా సౌమ్యుడు అయిన చిరంజీవి రాజశేఖర్ వ్యక్తిగతంగా వచ్చి కలవగానే, పాత విషయాలన్నీ మరిచిపోయి ఏమీ జరగనట్టే మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు కత్తి మహేష్ అయినా బహుశా ఇంతే. తన మీద వ్యక్తిగతంగా దాడి చేసిన వాళ్ళ మీద లీగల్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉండీ ఆయన ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా మీడియాకి, సోషల్ మీడియాకి ఎక్కి రచ్చ చేస్తున్నాడు. చిరంజీవి చెబితేనో, పవన్ చెబితేనో ఫ్యాన్స్ ఆగిపోతారనుకోవడం మూర్ఖత్వం. గోరక్షక దళాల పేరిట జరుగుతున్న హింస ని మోడీ తీవ్ర స్వరం తో మందలించిన తర్వాత కూడా గోరక్షక దళాల హింస కొనసాగింది. ఆ హింస కి పాల్పడ్డ వారిపై చట్టపర చర్యల ద్వారానే ఆ సమస్యకి పరిష్కారం దొరికింది కానీ మందలించడం ద్వారా, అభ్యర్థించడం ద్వారా కాదు. అలా అరికట్టడం మోడీ కి కూడా సాధ్యం కాలేదు. ఇది చట్టపరమైన చర్యలు తీసుకుని పరిష్కరించుకోవాల్సిన సమస్య. అలాగే కత్తి మహేష్ సమస్య కూడా. ఆయనకి తెలిసి జరుగుతోందో, తెలీక జరుగుతోందో కానీ, ఈ సమస్యని సాగదీయడం వెనుక, దీనికి విపరీతమైన మీడియా కవరేజ్ దొరకడం వెనుక, ఖచ్చితమైన రాజకీయ వ్యూహమేదో ఉందని సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. టివి ఛానెల్స్ కి కాల్ చేసిన వాళ్ళ లో 90% మంది అటు ఇటుగా ఇదే ప్రశ్నని ఛానెళ్ళకే సంధించడం అందుకు నిదర్శనం.