వైసీపీ నేతలు తాము వెళ్లడానికి ముందుగానే అనుచరుల్ని వెళ్లాలనుకుంటున్న పార్టీలోకి పంపుతున్నట్లుగా కనిపిస్తోంది. ధర్మవరంలో ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి పెద్దగా కనిపించని గుడ్‌మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మెల్లగా తన అనుచరుల్ని బీజేపీ, జనసేనల్లోకి పంపుతున్నారు. ఇది ధర్మవరం కూటమిలో దుమారం రేగుతోంది. ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కొంత మంది సత్యకుమార్ తో మాట్లాడుకుని బీజేపీలోచేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంకా బీజేపీలో చేరక ముందే వారు రెచ్చిపోయారు.
ధర్మవరం పట్టణంలో బీజేపీలో చేరాలనుకున్న వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేతలపై విరుచుకపడ్డారు. దాడులు చేశారు. దాంతో కాసేపు భయానక వాతావరణం ఏర్పడింది. వైసీపీలో ఉండి ఇలాంటి పనులు చేస్తే ట్రీట్ మెంట్ నెక్ట్స్ లెవల్ లో ఉంటుంది కనుక వారు బీజేపీ ముసుగు వేసుకునే ప్రయత్నం చేశారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. కేతిరెడ్డితో పాటు పదేళ్ల పాటు చేయాల్సిన అరాచకం అంతా చేసి కబ్జాలతో హోరెత్తించిన వారు ఇప్పుడు బీజేపీ అండతో వాటిని కాపాడుకోవాలనుకుంటున్నారు.
2019 ఎన్నికల తర్వాత ధర్మవరంలో టీడీపీ నేత వరదాపురం సూరి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అ తర్వాత పరిటాల శ్రీరామ్ నియోజకవర్గ ఇంచార్జ్ గా పార్టీని చక్కబెట్టారు. ఎన్నికలకు ముందు సూరి టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ శ్రీరామ్ అంగీకరించలేదు. చివరికి ఆ సీటు బీజేపీకి వెళ్లింది. పరిటాల శ్రీరామ్ దగ్గరుండి గెలిపించారు. ఇప్పుడు కేతిరెడ్డి బీజేపీలోనే తన అనుచరుల్ని చేర్చి.. పరిటాల శ్రీరామ్‌కు చెక్ పెట్టాలనుకుంటున్నారు.