ఏపీలో వైసీపీ ఘోర పరాజయంపై పోస్ట్ మార్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓటమికి వాలంటీర్లు, మద్యం పాలసీ, నేతల నోటి దురుసే కారణమని ఇలా.. పలువురు నేతలు పలు రకాలుగా విశ్లేషించారు. ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ స్టార్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాత్రం ప్రజలకు ఏ సమస్య లేకుండా చేయడం వల్లే ఓటమి పాలయ్యామని కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు.
అడగనిదే ఇస్తే దేనికీ విలువ ఉండదని అదే వైసీపీ సర్కార్ చేసిన తప్పిదమంటూ వ్యాఖ్యానించారు. డిమాండ్ – సప్లై రూపంలోనే ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సి ఉండాల్సిందని తెలిపారు. నియోజకవర్గంలో ఏదైనా పని చేయించాలంటే 10రోజులు ఎమ్మెల్యే దగ్గరికి తిరగాలి. అనంతరం మరో 20రోజుల తర్వాత ఆ సమస్యను ఎమ్మెల్యే పరిష్కరిస్తారు. ప్రజలు అలా చేస్తేనే ఎమ్మెల్యేగా గుర్తిస్తారేమో. కానీ తాను మాత్రం అందుకు విరుద్దంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జనం సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడమే తప్పై పోయిందన్నారు.
ఎవరైనా ఏదైనా అడిగితేనే మేలు చేయాలి. కానీ అడగకుండానే ఎలాంటి సాయం చేయొద్దు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే జరిగిందంటూ కేతిరెడ్డి తన గురించి, వైసీపీ గురించి కాస్త ఎక్కువగానే చెప్పుకున్నారు కేతిరెడ్డి. ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరిట ఆయన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అదే సమయంలో భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
అయినా, ధర్మవరంకు పెద్దగా పరిచయం లేని నేత చేతిలో కేతిరెడ్డి ఓటమి పాలయ్యారంటేనే ఆయనపై ప్రజల్లో ఎంత నెగిటివిటి ఏందో అర్థం చేసుకోవచ్చు. ఓటమికి కారణం స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ఇంకా ప్రజలదే తప్పంటే..కేతిరెడ్డిని ఎవరూ బాగుచేయలేరు. ఈభ్రమల నుంచి బయటకు వస్తేనే ధర్మవరంలో కేతిరెడ్డికి భవిష్యత్.