చిరంజీవి ఈ సీజన్లో చేస్తున్న మరో రీమేక్… లూసీఫర్. ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. స్క్రిప్టు వర్క్ దాదాపుగా పూర్తయ్యింది. లూసీఫర్ ఉన్నది ఉన్నట్టు తీస్తే.. తెలుగు ప్రేక్షకులకు, అందునా మెగాస్టార్ అభిమానులకు రుచించకపోవొచ్చు. అందుకే… కీలకమైన మార్పులు అవసరం అయ్యాయి. లూసీఫర్ లో మోహన్ లాల్.. ఓ డాన్. అయితే… డాన్‌గా తను ఏం చేశాడు? తన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అనేది చూపించలేదు. రీమేక్‌లో మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్ ని చాలా క్లాసీగా, స్టైలీష్ గా తీర్చిదిద్దబోతున్నార్ట. దాదాపు 15 నిమిషాల పాటు చిరంజీవి మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడని, ఆ సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ ని అలరిస్తాయని తెలుస్తోంది. లూసీఫర్ పరంగా కనిపించే కీలకమైన మార్పు ఇదే. ఈ ఫ్లాష్ బ్యాక్‌లోనే హీరోయిన్ ఎపిసోడ్ కూడా ఉండబోతోంది.
పతాక సన్నివేశాల్లో పృథ్వీరాజ్ ఆగమనం.. లూసీఫర్‌లో ఆకట్టుకుంది. ఆ పాత్రని ఉంచాలా? తీసేయాలా? అనే విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. లూసీఫర్ లో చాలా కీలకమైన ట్విస్ట్ అది. నిజానికి మరో హీరో అవసరం ఏర్పడే పాత్ర అది. ఆ పాత్రేం లేకుండా రీమేక్ చేయాలని చిరు నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టే స్క్రిప్టు మారింది కూడా. అయితే ఇప్పుడు క్లైమాక్స్ లో కనిపించే ఫృద్వీరాజ్ పాత్రని అలానే ఉంచేయాలని అనుకుంటున్నారు. ఆ పాత్రని ఓ హీరోతో చేయించాలి. ఆ హీరోగా ఎవరిని తీసుకోవాలి? అనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ విషయంలో చిరు నిర్ణయమే ఫైనల్. `ఆచార్య` అవ్వగానే లూసీఫర్ రీమేక్ మొదలవుతుంది. ఈలోగా.. ఆ హీరో ఎవరన్న విషయంలో క్లారిటీ వస్తుంది.