స్మితా సభర్వాల్. ఈ పేరు తెలంగాణ అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చిరపరిచితమే. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారికయితే చెప్పాల్సిన పని లేదు. ఐఏఎస్ అఫీసరే అయిన ఫ్యాషనబుల్ గా తాను చెప్పాలనుకున్నది.. ఎక్స్ ప్రెస్ చేయాలనుకున్న మాటల్ని నిర్మోహటంగా చెప్పేస్తారు. ఆమె బీఆర్ఎస్ పెద్దలకు ఇష్టమైన ఆఫీసర్. ఆమెకు కూడా బీఆర్ఎస్ అంటే ఇష్టమేమో కానీ.. ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సీఎంను కనీసం పరిచయం చేసుకునేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు.
ప్రస్తుతం సీఎంవో ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు చూస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. కొత్త ప్రభుత్వం మారిన తర్వాత స్మితా సభర్వాల్ సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న కీలక సమీక్షలకు హాజరు కావడం లేదు. భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. తాను కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఎంట్రీ వస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే కేంద్ర సర్వీస్ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ ను కలిశారు. ప్రభుత్వాలు మారడం సహజమే కానీ..అధికారులు మాత్రం రిటైరయ్యే వరకూ ఉంటారు. అందుకే గత ప్రభుత్వ పెద్దలతో ఎలా ఉన్నా.. ప్రభుత్వం మారగనే అధికారులు కూడా మారిపోతారు. కానీ స్మితాసభర్వాల్ మాత్రం అలా మారలేకపోతున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి.