ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడుగా విచారణ చేస్తుండగానే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టును సీబీఐ అభ్యర్థించింది. సీబీఐ అభ్యర్థనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా… సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.
మద్యం కుంభకోణంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ గతంలో సీబీఐ కవితను కోరింది. అప్పట్లో సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్ లో ఉందని.. తీర్పు వచ్చాకే విచారణకు హాజరు అవుతానని ఆమె సీబీఐకి వివరించింది. ఈ క్రమంలోనే ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా కవితను తమ ఎదుట విచారణకు అనుమతించాలని సీబీఐ కూడా కోరడంతో కోర్టు సానుకూలంగా స్పందించింది. కవితను ప్రశ్నించే సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను గదిలో ఉంచాలని షరతు విధించింది. కవితను ప్రశ్నించే ముందు రోజు కోర్టుకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.